వైసీపీ కోసం ఐప్యాక్ సర్వే?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా పనిచేస్తున్న ప్రశాంత్‌కిషోర్ తప్పుకోవడంతో ఆయన స్థానంలో రుషిరాజ్‌సింగ్ నియమితులైన సంగతి తెలిసిందే. 'ఐ ప్యాక్‌'లో తన సహచరుడైన రుషిరాజ్‌కు పీకే బాధ్యతలు అప్పగించారు. తాజాగా ఆయన ప్రభుత్వంపై సర్వే నిర్వహింపచేసినట్లు తెలుస్తోంది. వెల్లడైన ఫలితాలు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని ఆలోచనలో పడేసినట్లు సమాచారం. ''గడప గడపకు మన ప్రభుత్వం'' కార్యక్రమం ఒకవైపు జరుగుతుండగా మరోవైపు 'ఐప్యాక్' సంస్థ ఎమ్మెల్యేల పనితీరు, ప్రభుత్వ పనితీరుపై సర్వే నిర్వహించి ఎమ్మెల్యేలపట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు నివేదిక అందజేసినట్లు సమాచారం. 2024లో జరగబోయే ఎన్నికల కోసం 'ఐప్యాక్' ఇప్పటికే మూడుసార్లు సర్వేలు నిర్వహించింది. తాజాగా రుషిరాజ్ చేసిన సర్వేలో ఫలితాలు అంత సానుకూలంగా రాకపోవడంతో ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేకంగా సమావేశమవబోతున్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపొంది రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని భావిస్తున్న వైఎస్ జగన్ అన్నివర్గాల మద్దతు పొందేందుకు కృషిచేస్తున్నారు. అందులో భాగంగానే బీసీలను ఆకట్టుకోవడానికి తెలంగాణ నుంచి ఎంపిక చేసి ఆర్‌.కృష్ణయ్యకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి వైసీపీ వైపు మళ్లిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లతోపాటు బీసీలందరినీ తనవైపు తిప్పుకుంటే అధికారం సులభమనేది వైసీపీ అంచనాగా కనిపిస్తుంది.  రుషిరాజ్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఏయే నియోజకవర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది? అక్కడి ఎమ్మెల్యే పరిస్థితి ఏమిటి? వారిని తొలగించి కొత్తవారికి సీటు ఇవ్వడంవల్ల లభించే ప్రయోజనాలేంటి? అక్కడి ప్రజల ఆలోచనా తీరు.. తదితర అంశాలపై ముఖ్యమంత్రి దృష్టిసారించారు. ఎమ్మెల్యేలు వ్యాపారాలు నిర్వహిస్తూ ప్రజలకు దూరంగా ఉండటమే దీనికి కారణమని తేలుతోంది. ఒకవైపు ప్లీనరీని విజయవంతంగా నిర్వహించినప్పటికీ నివేదికల్లో కొంతమందిపై వ్యతిరేకత రావడం జగన్‌ను ఆలోచనలో పడేసిందని, కొన్నివర్గాలకు చెందిన ప్రజల్లో కూడా అసంతృప్తి ఉందని తేలడంతో వారిని పార్టీవైపు మళ్లించే ప్రయత్నాలను పార్టీ అధిష్టానం ప్రారంభించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)