ట్రక్కును ఢీ కొని పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ రైలు

Telugu Lo Computer
0

 


అమెరికాలోని మిస్సోరిలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. ఇప్పటివరకు ముగ్గురి మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీశారు. 250 మంది వరకు గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, సహాయక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని యుద్ధ ప్రాతిపదికన ఆసుపత్రులకు తరలిస్తోన్నారు.  ప్రమాద సమయంలో రైలులో 243 మంది ప్రయాణికులు 12 మంది సిబ్బంది ఉన్నారు. మొత్తం ఎనిమిది బోగీలతో కూడిన ఆమ్‌ట్రాక్ రైలు ఇది. లాస్ ఏంజిలిస్ నుంచి చికాగోకు వెళ్తోండగా.. మార్గమధ్యలో ఛారిటన్ కంట్రీలోని మెండన్ గ్రామ సమీపంలో ప్రమాదానికి గురైంది.  కాన్సాస్ సిటీకి ఈశాన్య దిశగా 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ మెండన్ టౌన్. పట్టాలు దాటుతున్న ఓ భారీ డంప్ ట్రక్కును వేగంగా ఢీ కొట్టింది. ఆ వేగానికి ట్రక్కు మొత్తం తునాతునకలైంది. టైర్లు ఎగిరిపడ్డాయి. కొన్ని మీటర్ల దూరం వరకు ట్రక్కును లాక్కెళ్లింది ఈ సౌత్‌వెస్ట్ చీఫ్ ట్రైన్ నంబర్ 4. ఆ తరువాత పట్టాలు తప్పింది. బోగీలన్నీ కుడివైపునకు పల్టీ కొట్టాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ముగ్గురు ప్రయాణికులు దుర్మరణం పాలైనట్లు మిస్సోరీ స్టేట్ హైవే పెట్రోల్, ఛారిటన్ కంట్రీ అంబులెన్స్ సర్వీస్ తెలిపాయి. మృతుల సంఖ్య మరింత పెరగ వచ్చని అంచనా వేశాయి. బోగీలు పట్టాలు తప్పిన వెంటనే ప్రయాణికులు.. కిటికీ అద్దాలను పగులగొట్టుకుని బయటికి రావడం కనిపించింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. స్వల్పంగా గాయపడ్డ వారిని ప్రత్యేక బస్సుల్లో మెండన్ గ్రామంలోని ఓ పాఠశాలకు తరలించారు. అక్కడ ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్‌లో చికిత్స అందించారు. తీవ్రంగా గాయపడ్డ వారిని ప్రత్యేక హెలికాప్టర్‌లో కాన్సాస్ సిటీకి తరలించారు. మరికొందరిని కొలంబియా యూనివర్శిటీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన పట్ల మిస్సోరి గవర్నర్ మైక్ పర్సన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల సంఖ్య మరింత పెరగకుండా అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నామని, గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సహయాన్ని అందిస్తున్నామని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)