అగ్నిపథ్‌ వల్ల యువతకు ఎంతో ప్రయోజనం

Telugu Lo Computer
0


“అగ్నిపథ్‌” పేరుతో కేంద్ర ప్రభుత్వం త్రివిధ దళాలు, సాయుధ బలగాల నియామక ప్రక్రియలో కొత్త సర్వీసు పథకాన్ని ప్రారంభించిన విషయంపై నిరుద్యోగులు మండిపడుతోన్న వేళ కేంద్ర మంత్రి అమిత్ షా మాత్రం ఆ పథకంపై ప్రశంసల జల్లు కురిపించారు. కాంట్రాక్టు పద్ధతిలో నాలుగేళ్ల కాలపరిమితితో ఉండే ఈ సర్వీసుపై ఆయన ట్వీట్ చేశారు. అగ్నిపథ్ పథకాన్ని పొగుడుతూ, ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతూ పలు వ్యాఖ్యలు చేశారు. గత రెండేళ్ళలో కరోనా మహమ్మారి కారణంగా సైన్యంలోని నియామక ప్రక్రియ ప్రభావితమైందని చెప్పుకొచ్చారు. కాబట్టి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘అగ్నిపథ్ యోజన’లో యువత కోసం, వయోపరిమితిలో రెండేళ్ల రాయితీని ఇచ్చారని చెప్పారు. అగ్నిపథ్ వయోపరిమితి 21 ఏళ్ల నుంచి 23 ఏళ్లుగా మార్చేందుకు నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. ఈ నిర్ణయం ద్వారా పెద్ద సంఖ్యలో యువత ప్రయోజనం పొందుతారని చెప్పారు. అగ్నిపథ్ పథకం ద్వారా యువత దేశానికి సేవ చేయవచ్చని, వారు ఉజ్వల భవిష్యత్తు దిశగా ముందుకు సాగుతారని ఆయన అన్నారు. కాగా, దేశ వ్యాప్తంగా అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)