వియత్నాంకు 12 హై-స్పీడ్ గార్డ్ బోట్లు

Telugu Lo Computer
0


వియత్నాంకు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం 12 హై-స్పీడ్ గార్డ్ బోట్లను అందించారు. సముద్రతల రక్షణ వ్యవస్థకు ఈ పడవలు ఉపయోగపడతాయి. దక్షిణ చైనా సముద్ర జలాల్లో చైనా దూకుడుగా వ్యవహరిస్తోన్న నేపథ్యంలో వియత్నాంకు భారత్ ఈ పడవలు అందించడం గమనార్హం. ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్యలో వియత్నాం ఓ ముఖ్యదేశం. దక్షిణ చైనా సముద్రం విషయంలో డ్రాగన్ దేశంతో వియత్నాంకు విభేదాలు ఉన్నాయి. వియత్నాంకు భారత్ ప్రకటించిన 777 కోట్ల రూపాయల లైన్ ఆఫ్ క్రెడిట్ కింద ఈ పడవలను అభివృద్ధి చేశారు. వియత్నాం పర్యటనలో ఉన్న రాజ్‌నాథ్ సింగ్ హాంగ్ హా షిప్‌యార్డ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 12 అత్యంత వేగవంతమైన పడవల నిర్మాణ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశామని అన్నారు. ఇది భారత్‌, వియత్నాం కలిసి రక్షణ రంగ వ్యవస్థలో కొనసాగించే ప్రాజెక్టులకు సూచికగా నిలుస్తుందని చెప్పారు. మేకిన్ ఇండియా-మేక్ ఫర్ ది వరల్డ్ మిషన్‌కు ఓ చక్కని ఉదాహరణగా నిలుస్తుందని తెలిపారు. కాగా, రక్షణ వ్యవస్థకు సంబంధించిన ఈ 12 పడవల్లో అయిదింటిని భారత్‌లోని ఎల్ అండ్ టీ షిప్‌యార్డులో తయారు చేశారు. మిగతా ఏడు పడవలు వియత్నాంలోని హాంగ్ హా షిప్ యార్డులో తయారయ్యాయి. కాగా, భారత్‌-వియత్నాం మధ్య బుధవారం పలు ఒప్పందాలు కుదిరాయి. ఇండో-పసిఫిక్ ప్రాంత అభివృద్ధి, సుస్థిరతకు భారత్, వియత్నాం మధ్య రక్షణ, భద్రత రంగాల్లో సత్సంబంధాలు కీలకంగా నిలుస్తాయని ఈ సందర్భంగా రాజ్ నాథ్ అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)