కోవిడ్ టీకాకరణలో ప్రపంచానికి ఇండియా ఆదర్శం !

Telugu Lo Computer
0


కోవిడ్-19 టీకాకరణ  కార్యక్రమంలో ఇండియా విజయం సాధించిందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్  ప్రశంసించారు. ఆరోగ్య రంగంలో సత్ఫలితాలు సాధించడం కోసం భారత ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ప్రపంచానికి ఓ చక్కని పాఠమని తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఇటీవల ఇచ్చిన ట్వీట్‌పై బిల్ గేట్స్ స్పందించిన సంగతి తెలిసిందే. మన్‌సుఖ్ మాండవీయ ఈ నెల 25న ఇచ్చిన ట్వీట్‌లో, బిల్ గేట్స్‌తో మాట్లాడటం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కోవిడ్-19 మహమ్మారి మేనేజ్‌మెంట్, భారీ స్థాయిలో నిర్వహించిన టీకాకరణ కార్యక్రమాలను బిల్ గేట్స్ ప్రశంసించారని తెలిపారు. తాను గేట్స్‌తో కలిసి వరల్డ్ ఎకనమిక్ ఫోరం, 2022 వద్ద సమావేశమైనట్లు పేర్కొంటూ ఫొటోను జత చేశారు. మన్‌సుఖ్ ట్వీట్‌కు బిల్ గేట్స్ ఈ నెల 28న బదులిచ్చారు. ''డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయను కలుసుకుని, ప్రపంచ ఆరోగ్య రంగంపై అభిప్రాయాలను పంచుకోవడం చాలా సంతోషకరం. టీకాకరణ కార్యక్రమంలో విజయం సాధించడం, పెద్ద ఎత్తున ఆరోగ్య సంబంధిత సత్ఫలితాలను సాధించడం కోసం టెక్నాలజీని వినియోగించడం ద్వారా భారత దేశం ప్రపంచానికి అనేక పాఠాలను అందుబాటులో ఉంచింది'' అని ప్రశంసించారు. మాండవీయ ఇచ్చిన మరొక ట్వీట్‌లో, తామిద్దరమూ ఆరోగ్య రంగానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించామని తెలిపారు. డిజిటల్ హెల్త్, వ్యాధుల నియంత్రణ నిర్వహణ, ప్రాంతీయ కేంద్రాల ఏర్పాటు, అందరికీ అందుబాటులో ఉండే, నాణ్యమైన డయాగ్నొస్టిక్స్, మెడికల్ డివైసెస్ అభివృద్ధి వంటి అంశాలపై చర్చించినట్లు తెలిపారు. భారత దేశం గత ఏడాది జనవరి నుంచి కోవిడ్-19 టీకాకరణను ప్రారంభించింది. ఇప్పటి వరకు వయోజనుల్లో దాదాపు 88 శాతం మంది సంపూర్ణంగా టీకాలు తీసుకున్నారని ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. సీరం ఇన్‌స్టిట్యూట్ తయారు చేసిన కొవిషీల్డ్, స్వదేశంలో అభివృద్ధిపరచిన కోవాగ్జిన్ టీకాలను భారత్ అత్యధికంగా ఉపయోగించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)