మాజీ మంత్రి నారాయణ అరెస్ట్

Telugu Lo Computer
0


మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు పొంగూరు నారాయణ అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ లోని ఆయన ఇంటి వద్ద ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఏపీకి తరలిస్తున్నారు. కొండాపూర్ లోని ఆయన ఇంటివద్ద నారాయణను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఏపీకి తరలించడం సంచలనంగా మారింది. ఇటీవల కాలంలో నారాయణ మీద రెండు కేసులు నమోదయ్యాయి. దాంతో ఏ కేసులో నారాయణని అరెస్ట్ చేశారన్నది ఆసక్తిగా మారింది. నారాయణ విద్యాసంస్థల పేరుతో గడిచిన కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందారు పొంగూరు నారాయణ. 2014లో ఏపీలో టీడీపీకి అధికారం దక్కిన తర్వాత నారాయణకు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది. ఆ తర్వాత వెంటనే చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగానూ ఎంపికయ్యారు. ఐదేళ్ల పాటు ఏపీ పట్టణాభివృద్ధి, మునిసిపల్ శాఖ మంత్రులుగా ఆయన వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు నగరం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత రాజకీయంగా క్రియాశీలకంగా కనిపించడం లేదు. కానీ అమరావతి కేసుల విషయంలో మాత్రం ఆయన పేరు పలుమార్లు వార్తల్లోకొచ్చింది. గతంలో కూడా సీఐడీ ఆయన మీద కేసు నమోదు చేసింది. కానీ న్యాయస్థానం ఆదేశాలతో విచారణ ముందుకు సాగలేదు. తాజాగా ఆయన అరెస్ట్ అటు విద్యారంగంలోనూ, ఇటు రాజకీయంగానూ సంచలనంగా మారింది.మాజీ మంత్రి నారాయణ మీద గత నెల 27వ తేదీన చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పదో తరగతి పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ జరిగిందనేది అభియోగం. నారాయణ విద్యాసంస్థ కేంద్రంగా పదో తరగతి పరీక్షల నిర్వహణలో అవకతవకలకు పాల్పడ్డారంటూ పోలీసులు పేర్కొన్నారు. చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏప్రిల్ 27న ఎఫ్ ఐ ఆర్ నెం. 111/2022గా కేసు నమోదయ్యింది. చిత్తూరు జిల్లా విద్యాశాఖాధికారి ఎస్ పురుషోత్తం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. అమరావతి రాజధాని నగర నిర్మాణ మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో అక్రమాలు జరిగాయంటూ మరో కేసు మంగళగిరిలో సీఐడీ అధికారులు నమోదు చేశారు.మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో మే 9వ తేదీన ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, పట్టణాభివృద్ధి, మునిసిపల్ మంత్రిగా పనిచేసిన పి నారాయణతో పాటుగా లింగమనేని రమేష్ సహా పలువురిని నిందితులుగా పేర్కొన్నారు. అమరావతి నగర నిర్మాణంలో భాగంగా ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇతర నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయనేది అభియోగం. కొందరికి మేలు చేసేలా మాస్టార్ ప్లాన్ మార్చేశారని ఎఫ్ ఐ ఆర్ లో పేర్కొన్నారు. ఎఫ్ ఐ ఆర్ నెం. 16/2022గా ఈ కేసు నమోదయ్యింది.

Post a Comment

0Comments

Post a Comment (0)