మూడో ప్రపంచ యుద్ధం ముప్పు ?

Telugu Lo Computer
0


ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మరింత ఉధృతంగా మారుతోంది. అమెరికా సహా నాటో కూటమి దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తుండటంతో రష్యా సర్కారు మరింత భీకరంగా విరుచుకుపడుతోంది. నాటో దేశాలు తమను కవ్విస్తున్నాయని, ఇందుకు భారీ మూల్యం చెల్లించుకుంటాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోస్ హెచ్చరించారు. ఉక్రెయిన్ ఇలాగే మొండిగా వ్యవహరిస్తే మూడో ప్రపంచ యుద్ధం, అణ్వాయుధాల ప్రయోగం తప్పదంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందంపై తాము ఇప్పటికీ ఆశాభావంతో ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. టర్కీలో జరిగిన చర్చల్లోనే ఒక పరిష్కారం లభించాల్సిందని.. అయితే తాత్కాలిక ఒప్పందాలపై ఉక్రెయిన్ వెనక్కి తగ్గిందని ఆయన తెలిపారు. ఆ వైఖరి వల్లే తదుపరి ఒప్పందంలో ప్రతిష్టంభన నెలకొందని వివరించారు. మేరియుపోల్‌లోని ఉక్కు కర్మాగారం నుంచి పౌరుల తరలింపునకు తాము ముందుకొచ్చామని.. కానీ పౌరులను ఉక్రెయిన్ సైన్యం కవచాలుగా వాడుకుంటోందని పుతిన్ ఆరోపించారు. ఉక్రెయిన్‌ రక్షణ అవసరాలను తీర్చడానికి ఎలాంటి చర్య చేపట్టాలన్నా తాము సిద్ధంగానే ఉన్నామని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ప్రకటించారు. నాటో దేశాల అధికారులతో జర్మనీలోని అమెరికా సైనిక స్థావరంలో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆస్టిన్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌కు సైనిక సాయం కొనసాగేలా చూడటంపై సమాలోచనలు జరిపినట్లు పేర్కొన్నారు. సార్వభౌమ, ప్రజాస్వామ్య దేశంగా ఉక్రెయిన్ ఉండాలనేది తమ ఆకాంక్ష అన్నారు. కాగా ఉక్రెయిన్‌కు విమాన విధ్వంసక స్వయంచాలిత జెపార్డ్ తుపాకులను అందజేయనున్నట్లు జర్మనీ ప్రకటించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)