'తల్లీబిడ్డ ఎక్స్​ప్రెస్' సేవలు ప్రారంభం

Telugu Lo Computer
0


వైఎస్సార్‌ ‘తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ సేవల్లో భాగంగా అత్యాధునిక వసతులతో కూడిన 500 ఏసీ వాహనాలను ఇవాళ ఉదయం 10.30కు విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. కాన్పు కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి ప్రసవం అనంతరం తిరిగి వారిని ఇళ్లకు తీసుకెళ్లేందుకు ఈ వాహనాలను వినియోగించనున్నారు. వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా ద్వారా విశ్రాంతి సమయంలో తల్లి అవసరాల కోసం రూ. 5 వేలను సాయంగా అందించనున్నారు. ఏడాదికి సగటున నాలుగు లక్షల మందికి ఇది అందుబాటులోకి రానున్నట్లు ప్రభుత్వ అధికారులు అంచనా వేస్తున్నారు. తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవల కోసం టోల్‌ఫ్రీ నెంబర్‌ 102ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందుకోసం 500 వాహనాలను అందుబాటులోకి తెస్తున్నారు. జిల్లాల వారీగా చూస్తే.. శ్రీకాకుళానికి- 23, విజయనగరం- 33, విశాఖపట్నం- 67, తూర్పు గోదావరి- 62, పశ్చిమ గోదావరి- 33, కృష్ణా- 33, గుంటూరు- 31, ప్రకాశం- 24, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు- 19, చిత్తూరు- 52, కడప- 23, కర్నూలు- 64, అనంతపురానికి- 36 చొప్పున ఈ వాహనాలు అందుబాటులోకి వస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,057 ప్రభుత్వాస్పత్రుల్లో ఏడాదికి సగటున నాలుగు లక్షల దాకా ప్రసవాలు జరుగుతుంటాయి. ప్రస్తుతం నెలలు నిండిన గర్భిణులను కాన్పుకు ఇంటి నుంచి 108 వాహనంలో తీసుకెళ్లి ఆస్పత్రిలో చేరుస్తున్నారు. నాణ్యమైన వైద్య సేవలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రమాణాలు కలిగిన మందులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ఆయా ఆస్పత్రుల్లో జరిగే ప్రసవాల సంఖ్య ఆధారంగా డాక్టర్‌ వైఎస్సార్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలను కేటాయించినట్లు తెలుస్తోంది. తల్లీబిడ్డను ఇంటికి తరలించేటప్పుడు ఆస్పత్రుల్లోని నర్సులు, వాహనాల డ్రైవర్ల సమన్వయం కోసం ప్రత్యేకంగా యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఆస్పత్రుల్లో జరిగే ప్రతి ప్రసవానికి సంబంధించిన వివరాలు మాతృ, శిశు సంరక్షణ పోర్టల్‌లో నమోదు చేస్తారు. ఆ వివరాలను యాప్‌కు అనుసంధానించి బాలింతలను ఇంటికి తరలించేందుకు చర్యలు తీసుకుంటారు. బాలింతను వాహనంలో ఎక్కించుకున్నప్పుడు, ఆమెను ఇంటి దగ్గర దించాక ఈ యాప్‌లో డ్రైవర్‌ ఫొటో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. తల్లీబిడ్డల రక్షణ, భద్రతకు భరోసానిస్తూ అన్ని వాహనాలకూ జీపీఎస్‌ ట్రాకింగ్‌ సాంకేతికతను వాహనాల్లో ఉంచారు.

Post a Comment

0Comments

Post a Comment (0)