అవమానంగా అనిపించింది ....!

Telugu Lo Computer
0


మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు కొరటాల శివ 'ఆచార్య' అనే సినిమాను రూపొందించారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది కానీ కొన్ని కారణాల వలన ఆలస్యమవుతూ వస్తోంది. ఎట్టకేలకు ఏప్రిల్ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో చిత్ర బృందం ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో తాజాగా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కి రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలానే దర్శకుడు బాబీ, మెహర్ రమేష్, రామజోగయ్య శాస్త్రి, రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఇలా చాలా మంది గెస్ట్ లుగా వచ్చారు. ముందుగా సినిమాలో ఒక్కో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఆ తరువాత చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల శివలను స్టేజ్ పైకి పిలిచి.. ఫ్యాన్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు అడిగింది సుమ. ఈ సంభాషణ మొత్తం చాలా ఫన్నీగా సాగింది. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ''1988లో 'రుద్రవీణ' అనే సినిమా చేశాను. దానికి నేషనల్ ఇంటెగ్రిటీ అనే అవార్డు వచ్చింది. అది అందుకోవడానికి ఢిల్లీ వెళ్లాం. అవార్డు తీసుకోవడానికి ముందు తేనేటి విందు ఉంటుంది. అప్పుడు టీ తాగుతుండగా అక్కడ వాల్స్ మీద బాలీవుడ్ కి సంబంధించిన చాలా మంది సెలబ్రిటీల ఫొటోలు ఉన్నాయి. చాలా గొప్పగా అనిపించింది. సౌత్ సినిమాల గురించి కూడా ఉందనుకుంటే ఎంజీఆర్, జయలలితకు సంబంధించిన ఒక పోస్టర్ మాత్రమే ఉంది. ఎన్టీఆర్, ఏఎన్నార్, శివాజీ గణేశన్, విష్ణువర్ధన్ ఇలా ఎంతోమంది గొప్ప నటులు సౌత్ లో ఉన్నారు. కానీ వారికీ సంబంధించిన ఒక్క ఫొటో కూడా అక్కడ కనిపించలేదు. అప్పుడు నాకు చాలా అవమానంగా అనిపించింది. ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమా అని మాత్రమే ప్రొజెక్ట్ చేశారు వాళ్లు. ప్రాంతీయ భాష చిత్రాలకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు. నాకు అప్పుడు బాధగా అనిపించింది. దానికి సమాధానంగా నేను గర్వపడేలా, రొమ్ము విరుచుకునేలా మన తెలుగు సినిమా హద్దులు, ఎల్లలు చెరిపేసి ఇండియన్ సినిమా అని ప్రతి ఒక్కరు గర్వపడేలా చేశాయి 'బాహుబలి', 'బాహుబలి2', 'ఆర్ఆర్ఆర్'. అలాంటి సినిమాల దర్శకుడు రాజమౌళి మన టెక్నీషియన్ అవ్వడం గర్వకారణం. భారతీయ సినిమా ఒక మతమైతే దాని పీఠాదిపతి రాజమౌళి. రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' సినిమా షూటింగ్ లో ఉన్నప్పటికీ రాజమౌళి మా సినిమా కోసం చరణ్ ను బయటకు పంపించారు. 'ఆచార్య' పూర్తి స్థాయి కమర్షియల్ సినిమాగా తీర్చిదిద్దారు కొరటాల శివ. తిరు గారి సినిమాటోగ్రఫీ, రామ్-లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీ, మణిశర్మ అందించిన సంగీతం అన్నీ కూడా సినిమాకి ఎసెట్స్ గా నిలుస్తాయి. రాజమౌళి గారు వేసిన బాటలో ఇక అన్నీ పాన్ ఇండియాసినిమాలే. మొన్న 'పుష్ప', రీసెంట్ గా 'కేజీఎఫ్' ఇలా అన్నీ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అనే బేధాలు లేకుండా ఇండియన్ సినిమా అనే గుర్తింపు రావాలి. ఇండియన్ హీరోలనే అనాలి. ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రను ఏ నటుడైనా చేయొచ్చు కానీ చరణ్ ఉంటేనే న్యాయం జరుగుతుందని భావించారు కొరటాల శివ. అంత ఎమోషన్ ను పండించాడు. డాడీ సినిమాలో కనిపిస్తే చాలని అనుకున్నాడు చరణ్. కానీ చరణ్ ముందు నేను కనిపిస్తానో లేదో అనుకున్నాను. రాజమౌళి సినిమాల్లో నటించిన హీరోల నెక్స్ట్ సినిమాలు ఫ్లాప్ అవుతుంటాయని అంటుంటారు. కానీ అందులో నిజం లేదు. కంటెంట్ మిస్ ఫైర్ అవ్వడం వలన అలా జరిగి ఉంటుంది. ఇప్పుడు 'ఆచార్య' సినిమా ఆ మిత్ ను తుడిచేయనుంది'' అంటూ చెప్పుకొచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)