కోర్టు తీర్పుపై వైసీపీ కొత్త వ్యూహం !

Telugu Lo Computer
0


అమరావతిలో నిర్మాణాలు..రైతులకు ప్లాట్ల కేటాయింపు పైన రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది. అమరావతిలో నిర్మాణాలు కొనసాగించాలని ఆదేశించింది. అందుకు సమయం నిర్దేశించింది. రాజధానిలోని కార్యాలయాలను తరలించటానికి వీళ్లేదని స్పష్టం చేసింది. అదే సమయంలో అసెంబ్లీకి రాజధాని విభజన అధికారం అసెంబ్లీకి లేదని హైకోర్టు పేర్కొంది. హైకోర్టు తీర్పు పైన ఏపీ ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. దీని పైన సుప్రీంకు వెళ్లాలా లేదా అనే అంశం పైన ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ, శాసనసభకు రాజధాని మార్పు అధికారం లేదనే అంశం పైన ప్రభుత్వం లోతుగా అధ్యయనం చేస్తోంది. ఈ వ్యవహారం పైన అసెంబ్లీ వేదికగా చర్చ చేపట్టాలనే ఆలోచనలో ఉంది. కోర్టు తీర్పు తరువాత సైతం మంత్రులు మూడు రాజధానులే తమ విధానమని స్పష్టం చేసారు. ఇక, తాజాగా మాజీ మంత్రి సీనియర్ నేత ధర్మాన ప్రసాద రావు సీఎం కు రాసిన లేఖ హాట్ టాపిక్ గా మారింది. శాసన, న్యాయ, కార్యనిర్వాహక వర్గాల మధ్య అధికారాలపై చర్చించేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి ఆయన లేఖ రాశారు. రాజ్యాంగంలో డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ పేరుతో శాసన, న్యాయ, కార్య నిర్వాహక వ్యవస్థల పరిధిని స్పష్టంగా పేర్కొన్నారని లేఖలో వివరించారు. శాసనాలను తయారు చేయడం, విధి విధానాలను రూపొందించడం శాసనసభ హక్కు అని అని, దానిని కాదనడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. హైకోర్టు తీర్పులో శాసనసభ అధికారాలలోనూ, బాధ్యత నిర్వహణలోను న్యాయవ్యవస్థ జోక్యం చేసుకున్నట్టు అర్థమవుతోందన్నారు. కోర్టు తీర్పు పైన తాను వ్యాఖ్యానించటం లేదని స్పష్టం చేసారు. ఇదే సమయంలో మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో పెట్టే అంశం పైన ఆలోచన చేస్తున్నామని మంత్రి బొత్సా చెప్పుకొచ్చారు. తమ పార్టీ విధానం పరిపాలనా వికేంద్రీకరణ... అందుకు కట్టుబడి ఉన్నామని బొత్సా స్పష్టం చేసారు. శివరామకృష్ణ కమీషన్ కూడా పరిపాలనా వికేంద్రీకరణ ద్వారానే 13 జిల్లాల అభివృద్ది జరుగుతుంది అని పేర్కొందని మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు. ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో హైకోర్టు తీర్పు అంశం గురించి కాకుండా.. శాసన అధికారాల పైన చర్చ చేయాలని వైసీపీ సీనియర్లు కోరుకుంటున్నారు. ఈ చర్చ ద్వారా.. తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం కల్పించాలని సీనియర్లు సూచిస్తున్నారు. దీంతో.. దీని పైన సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గతంలో ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల అంశం పైన సభలో ప్రతిపాదన చేసిన సమయంలోనూ..మూడు ప్రాంతాలకు చెందిన నేతలు తమ అభిప్రాయాలుగా మూడు రాజధానుల అంశాన్ని పరోక్షంగా విన్నవించారు. ఇక, ఇప్పుడు శాసన అధికారాలు... మూడు రాజధానుల పైన సభలో చర్చ అంశంలో ఏం జరగనుందనే ఆసక్తి నెలకొని ఉంది. చర్చ జరిగితే ఏం నిర్ణయిస్తారనేది మరో ఆసక్తి కర అంశంగా మారుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)