అమెరికా అధికారికి కౌంటర్ ట్వీట్ !

Telugu Lo Computer
0


ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ప్రపంచ దేశాలు తప్పుబడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో దీనిపై ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్‌లో భారత మద్దతు కోరుతున్నట్లు అంతకుముందే రష్యా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే భారత్ మాత్రం ఈ ఓటింగ్‌లో పాల్గొనలేదు. దీనిపై అమెరికా సహా పలు పాశ్చాత్య దేశాలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అమెరికా విదేశీ వ్యవహారాల కౌన్సిల్ అధ్యక్షుడు రిచర్డ్ హాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పుతిన్‌కు భారత్ భయపడిందంటూ అవమానించాడు. 'రష్యా ఇలా బహిరంగంగా ఉక్రెయిన్ ఆక్రమణకు దిగింది. అయినా సరే భారత్ మాత్రం జాగ్రత్తగా ఉంది. పుతిన్‌కు కోపం తెప్పించకూడదనే భారత దేశం ఓటింగ్‌లో పాల్గొనలేదు. అంటే పెద్ద దేశాలకు ఉండే బాధ్యతలు నిర్వహించే సత్తా, ఆధారపడదగ్గ భాగస్వామిగా ఉండటానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి భారత్ సిద్ధంగా లేదనడానికి ఇదే నిదర్శనం. చైనా ఎదుగుదల కోణంలో చూసుకున్నా కూడా ఇది ముందు చూపు లేని నిర్ణయమే' అంటూ రిచర్డ్ విమర్శించారు. దీనిపై జోహో సీఈవో శ్రీధర్ వేంబు స్పందించారు. ''మిస్టర్ హాస్.. మీరు ఆఫ్ఘనిస్థాన్, ఉక్రెయిన్‌లో మీ విదేశీ పాలసీల వైఫల్యాలను పట్టించుకోకుండా, మీకు మద్దతు పలకలేదని భారత్‌ను విమర్శించాలని అనుకుంటున్నారా? ఉక్రెయిన్‌కు మీరు అండగా ఉన్నామనే భ్రమ కల్పించింది మీ ప్రభుత్వం. అవసరమైన సమయంలో చేతులెత్తేసింది కూడా మీరే. ఇప్పుడు భారత్‌పై పడి ఏడుస్తారే?'' అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)