నాపై కావాలనే నిందలు మోపుతున్నారు

Telugu Lo Computer
0


తనకు పుట్టిన బిడ్డికి ఆ ఎమ్మెల్యే కారణమని, 2 కోట్ల పోషణ పరిహారం చెల్లించాలంటూ ఓ మహిళ.. ఎమ్మెల్యేని డిమాండ్‌ చేస్తోంది. దీంతో సదరు ఎమ్మెల్యే ఆ మహిళపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కర్నాటక రాష్ట్రం కలబురగి జిల్లా సేడం విధానసభ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజకుమార్‌ పాటిల్‌పై ఈ ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆయన స్పందిస్తూ 2009లో ఆమె పరిచయమైందని, 2013లో ఓసారి కలిసి భూవివాదాన్ని పరిష్కరించాలని కోరినట్లు వివరించారు. ఆపై మరోసారి.. కుమారుడి చదువు కోసం సాయం చేయాలని కోరినట్లు తెలిపారు. దీని తర్వాత 2018లో సామాజిక మాధ్యమాల్లో తన గురించి చెడ్డగా సమాచారం ప్రచారం చేసినట్లు ఎమ్మెల్యే ఆరోపించారు. జాతీయ మహిళ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని బెదిరించి, నగదు కోసం డిమాండ్‌ చేసినట్లు వెల్లడించారు. 2021 మార్చిలో కలిసి డిమాండ్లను పరిష్కరించాలని ఒత్తిడి తెచ్చారని, ఇప్పుడు శాసనసభ్యుడి వల్ల తనకు సంతానం కలిగినట్లు నింద మోపుతూ బిడ్డ సంరక్షణ కోసం రూ.2 కోట్లు ఇవ్వాలని డిమాండు చేస్తున్నారని ఆరోపించారు. తనపై కావాలనే ఇటువంటి నిందలు మోపుతున్నారని నేనంటే గిట్టనివారు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.ఈ విషయంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ మహిళా విభాగం స్పందించింది. ఎమ్మెల్యేనే అన్యాయం చేశారని పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లిన మహిళని పోలీసులే వేధిస్తున్నారని ఆమ్‌ ఆద్మీ పార్టీ అధ్యక్షురాలు కుశల స్వామి ఆరోపించింది. సామాజిక మాధ్యమాల్లో సీఎం బొమ్మైకి తన కష్టాన్ని చెప్పుకొని, ప్రాణాలకు రక్షణ కల్పించాలంటూ విధానసౌధ ఠాణాలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా ఆమెను హౌస్‌ అరెస్టు చేయడం దారుణమన్నారు. విధిలేక ఆమె పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారని చెప్పుకొచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)