రైతు భరోసా పెండింగ్‌ దరఖాస్తులు 24వ తేదీలోగా పరిష్కారం ?

Telugu Lo Computer
0


కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోన్న విషయం తెలిసిందే. ఏటా రూ.6 వేలను ఏడాదిలో 3 విడతలుగా రైతులకు కేంద్రం పెట్టుబడి సాయం అందిస్తోంది. అయితే చాలా మంది రైతులు వివిధ కారణాలతో పీఎం కిసాన్‌ సాయానికి దూరమవుతున్నారు. కొంతమందికి ఏటా 3 విడతల్లోనూ పెట్టుబడి సాయం జమ కావడం లేదు. మరికొంత మందికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే జమవుతోంది కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు ఏపీ ప్రభుత్వం రూ.7,500 కలిపి వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ పేరిట రూ.13,500 చొప్పున రైతులకు అందిస్తోంది. అయితే, వివిధ సమస్యలు, సాంకేతిక కారణాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా 13.77 లక్షల దరఖాస్తులు పెండింగ్‌ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత సమస్యలన్నిటినీ ఈ నెల 24వ తేదీలోగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. పెండింగ్‌ దరఖాస్తుల డేటాను మండల వ్యవసాయాధికారులతో పాటు రైతు భరోసా కేంద్రాలకు కూడా పంపించింది. ఆర్బీకేల ద్వారా దరఖాస్తుదారులు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తారు. మండల వ్యవసాయాధికారి వద్ద కిసాన్‌ పోర్టల్‌లో తగిన వివరాలను అప్‌లోడ్‌ చేయించి, ఆ తర్వాత బ్యాంకు ద్వారా ఎన్‌పీసీఐ పోర్టల్‌తో మ్యాపింగ్‌ చేయించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. లబ్ధిదారు కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి/పెన్షన్‌దారు ఉండటం వంటి కారణాలతో 3,11,158 మందికి చెల్లింపులు నిలిచిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వెబ్‌ల్యాండ్‌ పోర్టల్‌ అనుసంధానం కాలేదంటూ 5,32,145 మందికి, ఎన్‌పీసీఐ మ్యాపింగ్‌ సమస్యలతో 2.05 లక్షల మందికి, ఆదాయ పన్ను చెల్లింపుదారులంటూ 99,106 మందికి, ఆధార్‌ విఫలం, అప్‌డేట్‌ చేయటం వంటి కారణాలతో 97,215 మందికి, ఆర్‌టీజీఎస్‌/ఎన్‌ఐసీ సమస్యలతో 76,743 మందికి, చనిపోయిన కారణంతో 25,626 మందికి, అకౌంట్‌ బ్లాక్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ తప్పుగా నమోదైన కేటగిరీలో 13 వేల మందికి, డూప్లికేట్, ఉమ్మడి ఖాతాలున్నాయనే కారణంతో 8166 మందికి, ఇతర కారణాలతో 7,645 మందికి పీఎం కిసాన్‌ సాయం అందడం లేదని గుర్తించారు. వీరిలో 10 నుంచి 20 శాతం మందికి రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతు భరోసా సాయం జమవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)