ఇంట్లోనే కరోనా నిర్ధారణ పరీక్ష!

Telugu Lo Computer
0


కరోనా కేసులు మరోసారి వేగంగా పెరుగుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల వేగం పెంచేందుకు కొత్త విధానం అమల్లోకి తీసుకొస్తోంది. దీని కోసం కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానం ఉన్న వారు ఆస్పత్రులు, పరీక్షా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే కరోనా నిర్ధారణ పరీక్ష చేసుకునే వెసులుబాటు తీసుకొచ్చింది. దీనికి సంబంధించి తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. లక్షణాలుంటే కుటుంబ సభ్యులు ఎవరికివారు ఇంట్లోనే పరీక్ష చేసుకునేందుకు అనుమతించాలని నిర్ణయించింది. తెలంగాణలో తిరిగి కరోనా కేసులు పెరగటంతో పాటుగా ఒమిక్రాన్ కేసులు సైతం వెలుగులోకి వస్తున్నాయి. దీంతో  ప్రభుత్వం ఈ విధానం అందుబాటులోకి తీసుకొచ్చింది. పరీక్షకు సంబంధించిన కిట్లను మెడికల్‌ షాపుల్లో విక్రయించేందుకు కూడా అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. ఏ విధంగా పరీక్ష చేసుకోవాలి.. నిర్దారణ ఎలా అవుతుందనే అంశాలు పరీక్ష కిట్ లోనే ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కిట్ ఎంత ధరలో విక్రయిస్తారనేది నిర్దారించాల్సి ఉంది. ఇప్పటికే అమెరికా, యూకే వంటి అనేక దేశాల్లో ఇంట్లోనే పరీక్షలు చేసుకునే వెసులుబాటు ఉందని అధికారులు చెబుతున్నారు. ఇంట్లో కరోనా పరీక్ష చేసుకున్నవారికి పాజిటివ్‌ నిర్ధారణ అయితే ఆ విషయాన్ని సంబంధిత ఆసుపత్రికి తెలియజేస్తే, హోం ఐసోలేషన్‌ కిట్లను ఇస్తారు. ఈ మేరకు ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు బాధ్యత తీసుకుంటారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లే ఏర్పాట్లు చేసుకోవాలి. ఈ నిర్ణయం ద్వారా ప్రయోజనాలతో పాటుగా సమస్యలు ఉన్నాయి. ఎవరికి వారు పరీక్ష చేసుకొని నిర్దారించుకుంటే..పాజిటివ్ వచ్చిన వారిలో ఎంతమంది బయటకు చెబుతారు.. ఆ వివరాలు ప్రభుత్వానికి ఎలా తెలుస్తుందనే సందేహం సైతం మొదలైంది. అలాగే స్వాబ్‌ను సరిగా తీయకుంటే సరైన ఫలితాలు వచ్చే అవకాశం తక్కువని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యశాఖ వద్ద 25 లక్షల మేరకు ర్యాపిడ్‌ యాంటిజెన్‌ కిట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని రెండు కోట్ల వరకు కొనుగోలు చేస్తారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 1100 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు.. పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో యాంటీజెన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో 90 శాతం పరీక్షలు ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పద్ధతిలోనే జరుగుతున్నాయి. రోజుకు వేలల్లో కరోనా నిర్ధారణ పరీక్షల కోసం ఆసుపత్రులకు వస్తుంటారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారు ఆస్పత్రులకు వెళ్లకుండానే ఇంటి వద్దే పరీక్ష చేసుకొనే వెసులుబాటు కలుగుతుందని చెబుతున్నారు. ర్యాపిడ్‌ పరీక్షల్లో నెగటివ్‌ వచ్చి లక్షణాలుంటే మాత్రం ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. వాటిని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులు, లేబొరేటరీల్లోనే చేస్తారు. ప్రస్తుతం వైరస్ వేగంగా వ్యాపిస్తున్న ఈ తరుణంలో ప్రభుత్వ నిర్ణయం అమలు పైన చర్చ మొదలైంది. థర్డ్ వేవ్ మొదలైనట్లుగా చెబుతున్న సమయంలో ఈ నిర్ణయం ఒక విధంగా ప్రయోజనకరంగా అని చెబుతున్నా.. అదే సమయంలో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)