అన్నమయ్య మార్గానికి డీపీఆర్ సిద్ధం చేయండి!

Telugu Lo Computer
0


తాళ్లపాక అన్నమాచార్యులు నడచిన మార్గం ద్వారా సొంత వాహనాల్లోను, నడక ద్వారా భక్తులు తిరుమలకు చేరుకునేలా రోడ్డు అభివృద్ధి చేస్తామని టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి చెప్పారు. ఈ మేరకు సమగ్ర నివేదికలు (డీపీఆర్) తయారు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. మామండూరు నుంచి తిరుమల పార్వేట మండపం వరకు ఉన్న అన్నమయ్య మార్గాన్ని ఆదివారం సుబ్బారెడ్డి పరిశీలించారు. టీటీడీ ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయం మేరకు వెంటనే సమగ్ర సర్వే చేసి అటవీశాఖ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. హైదరాబాద్, వైఎస్ ఆర్ కడప మార్గం ద్వారా తిరుమలకు వచ్చే భక్తులకు అన్నమయ్య మార్గం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. భారీ వర్షాల వల్ల ఇటీవల భారీ కొండ చరియలు విరిగిపడి తిరుమలకు ఘాట్ రోడ్ భారీగా దెబ్బతిన్న విషయాన్ని చైర్మన్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఉపద్రవాలు ఎదురైనా భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయంగా కూడా అన్నమయ్య మార్గం ఉపయోగ పడుతుందని ఆయన చెప్పారు. త్వరలోనే టెండర్లు పిలిచి ఈ మార్గం అభివృద్ధి చేస్తామన్నారు. అటవీ ప్రాంతంలో వన్య ప్రాణులకు ఇబ్బంది లేకుండా మామండూరు నుంచి తిరుమల కు 23 కిలోమీటర్ల దూరం వరకు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించినట్లు చైర్మన్ తెలిపారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఈ మార్గం అభివృద్ధి గురించి ఆలోచన చేశారని, అప్పటి టీటీడీ ధర్మ కర్తల మండలిలో కూడా చర్చ జరిగిందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు అన్నమయ్య మార్గాన్ని అభివృద్ధి చేస్తామని సుబ్బారెడ్డి తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)