ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ

Telugu Lo Computer
0


కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధిస్తూ గత వారం ఉత్తర్వులు వెలువరించింది. నేటి నుంచి ఈ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఈ నెల 31 వరకూ ఈ నిబంధనలు అమలులో ఉండనున్నాయి. రోజూ రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 వరకు కర్ఫ్యూ అమలు కానుంది. దీంతో పాటు ఇతర కరోనా నిబంధనలు కూడా అమలులోకి రానున్నాయి. ప్రజలందరూ తప్పని సరిగా మాస్క్‌లు ధరించాలి. అతిక్రమించిన వారికి జరిమానా విధిస్తారు. వివాహాలు, శుభకార్యాలు, ఇతర బహిరంగ కార్యక్రమాల కు గరిష్టంగా 200 మంది, ఇన్‌డోర్‌లో 100 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ కార్యక్రమాలకు హాజరయ్యే వారంతా కచ్చితంగా కొవిడ్‌ నిబంధనలను విధిగా పాటించాలి. సినిమా హాళ్లు, హోటళ్లు ,రెస్టారెంట్లలో భౌతిక దూరం పాటించాల్సి ఉంటుంది. ప్రజారవాణా వాహనాల్లో సిబ్బందితో పాటు, ప్రయాణికులూ మాస్క్‌లు ధరించాలి. వ్యాపార, వాణిజ్య సంస్థల యాజమాన్యాలు తమ ఆవరణలో ఉన్న వారంతా మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధిస్తారు. మార్కెట్లు, షాపింగ్‌ మాల్స్‌ , దేవాలయాలు, ప్రార్థన మందిరాలు, మతపరమైన ప్రదేశాలలో ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విపత్తు నిర్వహణ చట్టం-2005 లోని నిబంధనలు, ఐపీసీ సెక్షన్‌ 188 కింద చర్యలు ఉంటాయి. కర్ఫ్యూ నిబంధనల నుంచి ఆస్పత్రులు, మెడికల్‌ ల్యాబ్‌లు, ఫార్మసీ రంగాలతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియా, ఇంటర్నెట్‌ సర్వీసులు, ఐటీ సంబంధిత సేవలు, పెట్రోల్‌ బంకులు, విద్యుత్, నీటి సరఫరా, పారిశుధ్య సిబ్బందికి మినహాయింపు ఉంటుంది. అదే విధంగా అత్యవసర విధుల్లో ఉండే న్యాయాధికారులు, కోర్టు సిబ్బంది, స్థానిక సంస్థలకు చెందిన సిబ్బందిని కూడా ఈ ఆంక్షల నుంచి మినహాయించారు. అయితే.. వారు విధి నిర్వహణలో భాగంగా తమ గుర్తింపు కార్డును చూపాల్సి ఉంటుంది. వీరితో పాటు గర్భిణీలు, రోగులు.. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల నుంచి రాకపోకలు కొనసాగించే వారు తగిన ఆధారాలు, ప్రయాణ టికెట్లు చూపించాల్సి ఉంటుంది. అంతర్రాష్ట్ర, రాష్ట్ర సరుకు రవాణా వాహనాలకు కూడా కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)