ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన బాట

Telugu Lo Computer
0


ఆర్ధిక, ఆర్ధికేతర సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఏపి జేఏసీ, ఏపి జేఏసి అమరావతి సంఘాల నేతలు నేడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మను కలిసి ఉద్యమ కార్యాచరణ నోటీసును అందజేశారు. పీఆర్సీ అమలుతో పాటు వివిధ డిమాండ్లను విజ్ఞాపన పత్రంలో పేర్కొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరిని తీవ్రంగా ఖండించారు. ఇంత కాలం నుండి ఓపికపట్టినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రభుత్వంపై ఉద్యోగుల నుండి వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో కార్యాచరణకు పూనుకోవడం జరిగిందన్నారు. మొదటి దశ కార్యచరణను ప్రకటించారు. తమ కార్యాచరణ రెండవ దశకు వెళ్లకుండానే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపి అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పారాజు వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య దూరాన్ని పెంచేలా మంత్రి బుగ్గన వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. ఉద్యోగులను కించపరిచేలా మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. కారుణ నియామకాల్లో ప్రభుత్వం మాట తప్పిందన్నారు. ఉద్యోగులు రోడ్డు మీదకు రావడానికి కారణం ప్రభుత్వమేనన్నారు. మూడేళ్లు అవుతున్నా పీఆర్సీ నివేదిక ఎందుకు బహిర్గతం చేయడం లేదని ప్రశ్నించారు. నివేదికను బయట పెట్టకపోవడంతో ఆ నివేదికలో ఏమైనా లోపాలు ఉన్నాయా అన్న అనుమానం కలుగుతోందన్నారు. ఏపి జేఏసి అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ నెల రోజులుగా ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరిగి అలసిపోయామన్నారు. ఈ నెల 7వ తేదీ నుండి జరిగే ఉద్యమ కార్యాచరణలో ఉద్యోగులు అంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పీఆర్సీ, డీఏలు వంటి 45 డిమాండ్స్ ను ప్రభుత్వానికి ఇవ్వడం జరిగిందన్నారు. 7వ తేదీ నల్లబ్యాడ్జీలతో నిరసన. 10వ తేదీ మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిరసనలు. 13 వ తేదీన తాలూకా, డివిజన్ల స్థాయిలో నిరసన కార్యక్రమాలు, 27వ తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకూ విశాఖ, తిరుపతి, ఏలూరు సహా నాలుగు చోట్ల ఉద్యోగులతో ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)