ప్రమాదంపై పలు సందేహాలు!

Telugu Lo Computer
0


చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ సహా 14 మంది ప్రయాణిస్తున్న హెలిక్యాప్టర్ తమిళనాడులోని కూనూరు ఏరియాలో నీలగిరి కొండల్లో కూలిపోయింది. హెలిక్యాప్టర్‌లో బిపిన్ రావత్ కుటుంబసభ్యులు, సిబ్బంది ఉన్నారు. అయితే, ఈ ప్రమాద ఘటనపై పలు సందేహాలు వెల్లువెత్తున్నాయి. హెలిక్యాప్టర్ ఎలా కూలిపోయిందనే విషయంలో చాలా ప్రశ్నలకు అసలు సమాధానాలే లేవు. అలాంటి ప్రశ్నల్లో..

మొదటిది : హెలిక్యాప్టర్ కరెంటు తీగలకు తగిలి కూలిపోయిందా..?

ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న ప్రకారం హెలిక్యాప్టర్ ఒకదాని తర్వాత ఒకటి రెండు చెట్లను ఢీకొట్టింది. మంటల్లో కాలిపోతూ కూలిపోయింది. అయితే మంటలు హెలిక్యాప్టర్‌ చెట్లను ఢీకొట్టిన తర్వాత చెలరేగాయా..? లేదంటే స్థానిక తేయాకు తోటలపై ఉన్న విద్యుత్ లైన్‌కు తగలడం వల్ల మంటలు అంటుకున్నాయా..? అనే విషయంలో స్పష్టతలేదు.

రెండోది: కూలిన సమయంలో హెలిక్యాప్టర్ ఎంత ఎత్తులో ప్రయాణిస్తున్నది?

హెలిక్యాప్టర్ చెట్టును ఢీకొట్టి కూలిపోవడం చూశామని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అంటే హెలిక్యాప్టర్ తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ చెట్టును ఢీకొట్టిందా..? లేదంటే ఎక్కువ ఎత్తులో ప్రయాణిస్తూనే ఏదైనా సాంకేతిక లోపం తలెత్తి కిందికి పడిపోతూ చెట్టుకు ఢీకొట్టిందా..? అనే విషయంలో కూడా ఎలాంటి స్పష్టతలేదు.

మూడోది : హెలిక్యాప్టర్ కూలిపోవడానికి ఏది కారణం..?

హెలిక్యాప్టర్ కూలిపోవడానికి సాంకేతిక లోపమో, కరెంటు తీగలను తగలడమో, తక్కువ ఎత్తులో ప్రయాణించడమో కారణం కాకపోతే మరేది కారణమైనట్లు అనేది కూడా ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. పక్షి ఏదైనా తగిలి ఉండొచ్చా..? లేకపోతే ఎవరైనా బిపిన్ రావత్‌ను టార్గెట్ చేసి మిస్సైల్‌ దాడికి పాల్పడి ఉండవచ్చా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

నాలుగోది : యాంత్రిక వైఫల్యం తలెత్తి ఉండొచ్చా..?

పై కారణాలేవి కాకపోతే మరి యాంత్రిక వైఫల్యం ఏమైనా చోటుచేసుకుని ఉండొచ్చా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అయితే, రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఈ అత్యాధునిక మిలిటరీ రవాణా హెలిక్యాప్టర్‌లలో యాంత్రిక వైఫల్యం అనేది అసలే ఉండదని రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు. దాంతో ప్రమాదానికి యాంత్రిక వైఫల్యమే కారణమని కూడా కచ్చితంగా చెప్పలేని పరిస్థితి.

Post a Comment

0Comments

Post a Comment (0)