బారికేడ్లకు వేలాడుతూ కనిపించిన శవం

Telugu Lo Computer
0

 


దిల్లీ, హరియాణాల మధ్య సింఘు బోర్డర్‌లో పోలీస్ బారికేడ్లకు వేలాడుతున్న ఒక శవాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. "శుక్ర వారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో సోనిపట్‌లోని రైతుల నిరసన స్థలం కుండ్లి ప్రాంతంలో బారికేడ్లకు వేలాడుతున్న శవాన్ని గుర్తించాం. కాళ్లు తెగిపోయి ఉన్నాయి. దీనికి కారకులెవరో తెలియదు, గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురైనట్లుగా ఎఫ్ఐఆర్ నమోదుం చేశాం. ఈ ఘటనకు సంబంధించి వైరల్ అవుతున్న వీడియోలపైనా దర్యాప్తు చేస్తాం, వదంతుల నమ్మొద్దు'' అని సోనిపట్ డీఎస్‌పీ హన్స్‌రాజ్ ఏఎన్ఐ వార్తాసంస్థకు తెలిపారు. హత్యకు గురైన వ్యక్తిని పంజాబ్‌లోని తర్న్ తరాన్ జిల్లాకు చెందిన లఖ్‌బీర్ సింగ్‌గా గుర్తించారు. లఖ్‌బీర్ సింగ్ భార్య, ముగ్గురు పిల్లలు, సోదరితో కలిసి నివసిస్తున్నారని స్థానిక జర్నలిస్ట్ దిల్‌బాగ్ డానిష్ చెప్పారు. సింఘు బోర్డర్‌కు వారెందుకు వచ్చారు.. అక్కడ ఏం చేస్తున్నారనేది తెలియాల్సి ఉందన్నారు. సిక్కుల పవిత్ర గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్‌ను అపవిత్రం చేశాడన్న ఆరోపణలతో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ను కొట్టి చంపినట్లుగా కొన్ని వీడియోలు ప్రచారమవుతున్నాయి. కాగా లఖ్‌బీర్ సింగ్ హత్యను సంయుక్త్ కిసాన్ మోర్చా ఖండించింది. హతుడితో కానీ, హంతకులతో కానీ సంయుక్త్ కిసాన్ మోర్చాకు ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేసింది. ఈ క్రూరమైన హత్యను ఖండిస్తున్నట్లు చెప్పింది. ఏ మత గ్రంథాన్ని కానీ, చిహ్నాలను కానీ తాము పవిత్రమైనవిగా భావించమని చెప్పింది. వ్యక్తులు కానీ సమూహాలు కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదని.. ఈ హత్యపై సమగ్ర దర్యాప్తు జరిపి దోషులను శిక్షించాలని సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేసింది. రైతుల ఉద్యమం శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా సాగుతోందని.. హింసకు తాము వ్యతిరేకమని మోర్చా చెప్పింది. పోలీసుల దర్యాప్తుకు  అన్ని రకాలు సహకరిస్తామని తెలిపింది. మరణించిన లఖ్‌బీర్ సింగ్‌కు చిన్నపిల్లలు ఉన్నారని ఆయన బంధువులు తెలిపారు. లఖ్‌బీర్ సింగ్‌కు ఎవరో మత్తు మందు ఇచ్చి మోసపూరితంగా కుట్రలో ఇరికించి హతమార్చారని.. అసలైన నేరస్థులను పట్టుకుని శిక్షించాలని, లఖ్‌బీర్ కుటుంబానికి అండగా ఉండాలని ఆయన మామ కోరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)