కాళోజీ నారాయణ

Telugu Lo Computer
0



రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ  "కాళోజీ నారాయణరావు లేదా కాళోజీ లేదా కాళన్న"గా సుపరిచితులు. అతను తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం యొక్క ప్రతిధ్వనిగా కొనియాడబడతారు.అతను రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం.కవిత్వం వ్రాసిన ప్రజాకవి. హక్కులడిగిన ప్రజల మనిషి. ఉద్యమం నడిపిన ప్రజావాది. మొత్తంగా తెలంగాణ జీవిత చలనశీలి కాళోజి. పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు, వైతాళికుడు కాళోజి. నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా అతను తన కలం ఎత్తారు.అతను స్వాతంత్ర్యసమరయోధుడు, తెలంగాణా ఉద్యమకారుడు. అతను 1992లో భారతదేశ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ పొందారు.అతను జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా చేసి గౌరవించింది. వరంగల్ లో నెలకొన్న వైద్య విద్యాలయానికి అతను పేరు పెట్టబడింది. అలాగే హన్మకొండ పట్టణంలో కాళోజీ కళాక్షేత్రం పేరిట ఒక ఆడిటోరియంను నిర్మిస్తున్నారు. తెలంగాణ తొలిపొద్దు కాళోజీ. ‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి-అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు.

1914, సెప్టెంబరు 9 న కర్ణాటక రాష్ట్రం, బీజాపూర్ జిల్లా లోని రట్టిహళ్లి గ్రామంలో జన్మించారు. తల్లి రమాబాయమ్మ, కన్నడిగుల ఆడపడుచు. తండ్రి కాళోజీ రంగారావు మహారాష్ట్రీయుడు. కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీషు భాషల్లో రచయితగా ప్రఖ్యాతిగాంచారు. రాజకీయ వ్యంగ్య కవిత్వం వ్రాయడంలో కాళోజీ దిట్ట. ‘నా గొడవ’ పేరిట సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తిగడించారు. తెలంగాణ ప్రజల ఆర్తి, ఆవేదన, ఆగ్రహం అతను గేయాల్లో రూపుకడతాయి. బీజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తరలివచ్చిన కాళోజీ కుటుంబం మడికొండలో స్థిరపడింది. ప్రాథమిక విద్యానంతరం హైదరాబాదు పాతబస్తీలోని చౌమహల్ న్యాయపాఠశాలలో కొంతకాలం చదివిన కాళోజీ, అటు తరువాత సిటీ కాలేజీ లోనూ, హన్మకొండ లోని కాలేజియేట్ ఉన్నత పాఠశాల లోనూ చదువు కొనసాగించి మెట్రిక్యులేషను పూర్తిచేశారు.1939లో హైదరాబాదులో హైకోర్టుకు అనుబంధంగా ఉన్న న్యాయ కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.1930 నుంచే కాళోజీ గ్రంథాలయోద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు.

తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలన్నది కాళోజీ ఆకాంక్ష. సత్యాగ్రహోద్యమంలో పాల్గొని 25 సంవత్సరాల వయసులో జైలుశిక్ష అనుభవించారు. నిజామాంధ్ర మహాసభ, హైదరాబాదు స్టేట్ కాంగ్రెసుతో కాళోజీ అనుబంధం విడదీయరానిది. 1940లో రుక్మిణీబాయితో వివాహం జరిగింది. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, జమలాపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు, పి.వి.నరసింహారావు వంటి వారితో కలిసి కాళోజీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లులో గణపతి ఉత్సవాలు నిర్వహించారు. తెలంగాణలో అక్షరజ్యోతిని వ్యాపింపజేయాలన్న తపనతో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన ప్రముఖుల్లో కాళోజీ ఒకరు. రజాకార్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ 1945లో పరిషత్తు ద్వితీయ మహాసభలను దిగ్విజయంగా నిర్వహించడంలో కాళోజీ ప్రదర్శించిన చొరవ, ధైర్యసాహసాలను అతను అభిమానులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటుంటారు. వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు అతనుకు నగర బహిష్కరణశిక్ష విధించారు. స్వరాజ్య సమరంలో పాల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు, వారిని నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేర్పించి ఆదుకోవడంలో కాళోజీ పాత్ర అనన్యం. 1953లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. 1958లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసన మండలికి ఎన్నికయ్యారు. కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా, భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. ‘హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు’ అంటూ "సామాన్యుడే నా దేవుడు" అని ప్రకటించిన కాళోజీ 2002 నవంబరు 13 న తుదిశ్వాస విడిచారు. మరణానంతరం పార్థివ శరీరాన్ని కాకతీయ మెడికల్ కళాశాలకు అందజేసారు.

Post a Comment

0Comments

Post a Comment (0)