బెల్లం ముక్క కొసరు !

Telugu Lo Computer
0

 

ఆ రోజుల్లో ఆ ఊరికి అదొక్కటే దుకాణం. ఎవరికి ఏది కావాలన్నా అక్కడికే రావాలి. కాస్త పెద్ద కుటంబాలు అయితే, నెలకు ఒక్కసారే సరుకులు కొంచం ఎడంగా ఉన్న పట్నం నుండి తెచ్చుకుంటారు.  అయినా నాజూకులు తెలియన్ రోజులవి. పొద్దున టిఫిన్ అంటే ఎవరికీ తెలియదు.  అప్పటికి కాఫీలు అలవాటయాయి. అదీ పెద్ద కుటుంబాలలోనే. సాయంత్రాలు టీ. జనాలకు అవసరాలు పరిమితం.  

ఆ దుకాణం భూదేవివలె ఏది కావాలంటే. అవే ఇస్తుంది. తోరనాళ్ళా కట్టిన అర్ధణా టీ పాకెట్టులు, పచ్చళ్ళ పాకెట్టుల నుండి పొగాకు దాకా సమస్తం ఉంటాయి. కిరసనాయిలు, అగ్గిపెట్టల నుంది,సూదులు దారాల వరకు అన్నీ లభ్యం.ఇక పచారీ సరుకు అంటారా సమస్తం.  

పిల్లల చిరుతిళ్ళు, కానీ కానీ మిఠాయిలు,  తేగలు, బఠాణీలు, అన్నీ తెచ్చి పెడతాడు. గోలీ సోడాలు, కలర్లు, పిల్లలకు అది ఒక గని. గాలిపటాలు, బొంగరాలు, అన్నీ. కాదేది అమ్మకానికి అనర్హం. 

ఆ దుకాణాన్ని పోషిస్తున్నది బడుగువారే. పొద్దున్నే కూలీపనులకు వెళ్ళిన ఆడవాళ్ళు పదకొండూ పన్నేండు, మధ్య కాస్త కూలీ డబ్బులతో వస్తారు. అణా మిరపకాయలు, అణా చింతపండు, దోసెడు ఉప్పూ, పావలా పంచదార, ఇట్లా ఉంటై వారి అవసరాలు. కొలత అన్నది ఉండదు.  సాహుకారు పాత న్యూసు పేపరు ముక్కలుగా కత్తిరించి, ఒక తీగెకు గుచ్చి వేళాడదీసి ఉంచుతాడు. అందులో కాగితం గుంజడం, తన లెక్క ప్రకారం, వస్తువుల్ని తీసుకోడం, ఆ కాగితంలో కట్టడం, అందిచ్చడం.డబ్బులు ఇస్తే డబ్బులు,  ధాన్యం ఇస్తే ధాన్యం, తీసుకోడం గల్లాలో, డబ్బులు, ఒక సీనారేకు డ్రమ్ములొ ధాన్యం వేసుకోడం, తరువాతి బేరం.    

అందరినీ వరస పెట్టి పిలవడం, వాళ్ళ ఇంటి వ్యవహారాలు మాట్లాడడం, చంకన పిల్లలుంటే వారికి బెల్లం ముక్క పెట్టడం, నవ్వుతూ క్షణం కూడా వృధా చెయ్యని ఆ  సాహుకారు, ఎవరైనా పొట్లం విప్పి ఎంత ఉందో చూస్తే చాలు, ఇంకా ఇంతే ఉంది అంతే ఉంది అనకుండానే,  విరుచుకుపడతాడు. అప్పుడప్పుడు ఆ పొట్లం లాక్కుంటాడు.అట్లా ఆ పాటకజనాన్ని, అందులో ఆడవాళ్ళని అదరగొడ్తుంటాడు. ఆ రోజులు అటువంటివి.

ఇంకో కారణం అతి ముఖ్యమైనది. అరువులు అప్పులు. అరువుకి కొంటే కొరివే. అదీగాక.  డబ్బొ, ధాన్యమో ఇచ్చి కొనుక్కునే వారి వద్ద చెల్లుబటవనివీ,   అడుగుబొడుగువీ, ఎండిపోయినవీ, ఈ అరువు బేరాలవాళ్ళకి షోగ్గా అంటకడతాడు. వాళ్ళు కిక్కురు మనరు.  

ఇక తన దుకాణం ఆర్జన ఎక్కువా లేక వడ్డీల మీద వచ్చేది ఎక్కువా అంటే తను కూడా  చెప్పలేడు.

ఆ దుకాణం 24\7 అందుబాటులో ఉంటుంది. ఎందుచేత. వెనకే తన కాపరం కాబట్టి. ఇంటి,  ముందుగదిని. అరుగుని కలిపేశాడు. సాహుకారు లేనప్పుడు చంకలో పిల్లాడితో, ఆయన భార్యో, పదేళ్ళ కూతురో బేరాలు చూసుకుంటారు.

పట్నానికి వెళ్తున్నప్పుడు తప్ప షర్టు వేసుకోడు. ఎప్పుడూ ఒక అడ్డ పంచ,చేతుల్లేని బనీను. ఎప్పుడైనా ఆ బనీను కూడా తీసేస్తే, శరీర్మ్ మీద స్పష్టంగా ఆ బనీను చాయ. 

అప్పుడు నాకు తెలిసిందల్లా, అమ్మ ఎదైనా తెమ్మంటే పండగే. ఏది కొన్నా బెల్లం ముక్క కొసరు.

Post a Comment

0Comments

Post a Comment (0)