సారవకోట (సు)చుప్పులు

Telugu Lo Computer
0

 


సారవకోట శ్రీకాకుళం జిల్లా లో నరసన్నపేట మరియు పాతపట్నం మధ్యలో ఉన్న అందమైన గ్రామం.కిమిడి కళింగ రోడ్డు మీద ఉన్న ఈ ఊరు సుప్పులకి ఎంతో పేరు. సారవకోట అంటే అందరికీ గుర్తు వచ్చేది సుప్పులు. మీరు శ్రీకాకుళం వారైనా, పర్లాకిమిడి,పాతపట్నం ప్రాంతం వారైనా,తప్పకుండా ఈ అసలు సిసలు లోకల్ పిండి వంట పేరు వినే ఉంటారు.కోస్టల్ ఆంధ్రా తాపేస్వరం కాజా ఎంత ప్రాముఖ్యమో సారవకోట చుప్పు కూడా ఆ ప్రాంతం లో అంత ప్రాముఖ్యమే.కానీ, తాపేశ్వరం కాజాకు ఉన్నంత పేరు ఎందుకు లేదంటే,కేవలం సారవకోట చేసుకున్న పాపం ఉత్తరాంధ్ర లో ఉండటలోమే. అందుకే సర్వాంతర్యామి "గూగులమ్మ" కి తాపేశ్వరం కాజా తెల్సు కానీ సారవకోట- (సు)చుప్పులు మాత్రం తెలియవు .

చుప్పులు, చక్కిలాలు, సుక్కినాలు, కై మురుకు అన్నీ ఒక్క సంతానివే , ఇంచుమించు అన్ని ఒకే విధంగా చేస్తారు , కానీ రుచుల్లో కొంచం తేడా కనిపిస్తుంది. సారవకోట నువ్వుల చుప్పులకు ఎంతో ప్రత్యేకత వుంది.దట్టంగా నువ్వులు అద్ది క్రిస్ప్ గా వేచటం మూలాన్న దీనికో ప్రత్యేకమైన రుచి నిస్తుంది. కేవలం చేతి తోనే నేర్పుతో పిండిని చుట్లు తిప్పి ఎంతో కాలాన్ని వెచ్చించి కష్ట పడి చేసే ఈ పనికి రాబడి చాలా తక్కువే . కేవలం కొన్ని వైశ్య కుటుంబాలికి మాత్రమే ఈ నేర్పు పరిమితం.
శ్రీకాకుళం నుండి, నరసన్నపేట మీదుగ పాతపట్నం వెళ్తూ ఉంటే, సారవకోట దగ్గర రోడ్డుకి రెండు వైపులా ఎన్నో చిన్న చిన్న దుకాణాల్లో చుప్పులతో పాటు,"నువ్వుల అప్పడాలు "ఎన్నో రకాల వడియాలు కూడా అమ్ముతారు. తప్పకుండా అన్ని బస్సులు , కార్లు అక్కడ ఆపుతారని, ఆగినప్పుడల్లా తమకు బాగానే వ్యాపారం జరుగుతుందని అక్కడ వారు సంతోషంగా చెప్తారు.

Post a Comment

0Comments

Post a Comment (0)