ఎఫ్ ఎం రేడియో

Telugu Lo Computer
0

 

నేను టెన్త్ చదివేటప్పుడు మా ఇంటి ఎదురుగా ఒక చిన్న ఫంక్షన్ హాల్ ఉండేది,ఇంచుమించు నెలలో పదిహేను రోజులు ఎదో ఫంక్షన్ పేరు తో మైక్ పెట్టి పాటలతో  మాకు నిశబ్దం అనే మాట మర్చిపోయేలా చేసేవాడు,అన్ని అప్పుడే రిలీజు  అయిన సినిమా పాటలు వేసేవాడేమో మంచి సందడి గా ఉండేది,దానితో ఎంత గోల ఉన్న చదువుకోవడం అలవాటు అయ్యింది,దానికి తోడు మా ఇల్లు ఒక మినీ సైజ్ సత్రం మా ఊరు నుండి ఎవరికి ఏ పని పడినా మా ఇంటికి వచ్చేవారు,ఉన్న కాస్త సంపాదన లో నే  సర్ది లోటు అనేది తెలియకుండా ఒద్దికగా నడి పేది మా అమ్మ.

        దానితో మా ఇల్లు ఎప్పుడు నలుగురు మనుషులతో ఉండేది స్పెషల్ రూమ్ లు స్పెషల్ స్పేస్ లు వుండే అవకాశం లేకపోవడంతో  చుట్టూత ఎంత గోల ఉన్న చదువుకోవడం అలవాటు చేసుకున్నాం నేను తమ్ముడు కూడా, నేను డిగ్రీకి వచ్చేసరికి ఏడు ఏళ్ల తర్వాత ఆ ఇల్లు మారిపోయాము, కానీ గోలతో సావాసం అలవాటైపోయింది.  నిశబ్దం గా చదివితే ఎక్కి ఏడిసేది కాదు .

        అలాంటి టైంలో మా బీవీకే కాలేజ్ నుండి ఆర్టిసి కాంప్లెక్స్ కేసి నడుస్తూ వెళ్తుంటే రోడ్ పక్కన ఒకతను బోలెడు ఎలక్ట్రానిక్  వస్తువులు పెట్టి అమ్ముతున్నాడు వాటి మధ్యన ఒక సిల్వర్ కలర్ అరచేయి అంత  పొడవుతో బక్కచిక్కిన పెన్సిల్ బాక్స్ మాదిరి ఉంది ఒక డబ్బా, అదేంటి అని అడిగాను అతన్ని "ఎఫ్ ఎం" అండి అన్నాడు "అంటే" అని అమాయకంగా అడిగిన  నా వైపు చిరాగ్గా  చూసి "పాకెట్ రేడియో బ్యాటరీతో పని చేస్తుంది" అన్నాడు .

      ఎంత అంటే వంద రూపాయలు అన్నాడు, అసలే బేరం ఆడడంలో అసలు ప్రావీణ్యం లేని నేను ఏదో బేరం అయ్యిందని అనిపించి తొంభైకి కొన్నాను, ఇంటికి తెచ్చాక బ్యాటరీ వేసి కుడి వైపు నున్న మీట పైకి కిందకి తిప్పితే ఎక్కడో ఒక దగ్గర వివిధ భారతి వచ్చింది , ఆ రేడియోలో ఫ్రీక్వెన్సీ మీటర్ లేదు కాబట్టి ఇంకొంచెం తిప్పితే రేడియో ఎఫ్ ఏం వచ్చేది.

     పాపం వివిధ భారతి వాడు గవర్నమెంట్ టైమింగ్స్ పైగా మరీ రోజుకి ఒక నాలుగు గంటలు రావడం అపురూపం అందులోనూ ,మరీ దూరదర్శన్  వాళ్ళ వారసత్వం కనిపించేది, అందులోనూ ఇంచుమించుగా నేను చదువుకునే సమయం అంత రాత్రి ఏడుకి మొదలు పెడితే ఏ పదో పదకొండు గంటలు దాకా చదివి, మళ్ళీ కాసేపు పడుకుని రెండు గంటలకు లేచి మళ్ళీ నాలుగు దాకా చదివేసి మళ్ళీ పడుకునే దాన్ని.

       మొదట్లో చదువుతూ రేడియో వినడం అసలు నచ్చేది కాదు మా ఇంట్లో వాళ్ళకి, అందులో ముఖ్యంగా మా తాతగారికి "దీనికి రేడియో తోడు ఉంటే తప్ప చదువు ఎక్కట్లేదు అనుకుంటా ఇంక ఇది చదివినట్టే" అనేవారు, కానీ అదేమి అలవాటో గాని  కాస్త వదుల్చుకోవడం చాలా కష్టం బాబోయ్, ఇప్పటికి ఒకసారి ఒక పని చెయ్యడం రావట్లేదు ఏమి గోలో మరి.

      ఇంతకీ ఆ కొత్త ఎఫ్ ఎం లో  రాత్రి 10 నుండి వరస పెట్టి 90 ల నుండి వెనక్కి పాటలు వేసేవాడు "సువ్వి సువ్వి

  సువ్వాలమ్మ "అంటూ బాలు ఆడించినా ,"జాబిలమ్మ నీకు అంత కోపమా "అంటూ బుజ్జగించినా, "శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో "అంటూ లేత వయసులో ఉన్న మాకు గిలిగింతలు పెట్టినా మొత్తానికి 12 అయ్యేసరికి "ఓహ్ పాపా లాలి "అనో లేక మంద్రంగా సుశీల గారు "లాలి లాలి "అనో పాడేసరికి నిద్రా దేవత ప్రసన్నమైపోయేది కామోసు ఎంచక్క నిద్ర వచ్చేది.

        కాని పరీక్షలు దగ్గరకు వస్తుంటే తెల్లవారి 2.30 కి మెలకువ వచ్చేది ,అక్కడ నుండి ఒక రెండు గంటలు చదువుకునేటప్పుడు మళ్ళీ ఎఫ్ ఏం పాపం తోడు గా కూర్చుని సాధ్యమైనన్ని ఘంటసాల గారిపాటలు వినిపించేది"శివశంకరి,నమో వేంకటేశా  వంటి భక్తి గీతలే కాక,చూపులు కలిసిన శుభవేళ అంటూ దోబూచులు ఆడించి, కార్  లో షికారు కెళ్లే "అంటు నీతి చెప్పినా ,అలా అప్పటికే మా బామ్మ పుణ్యమాని పాత సినిమాలు కాస్త రుచి తెలిసింది.ఇలా వినివిని ఎఫ్ ఎం లో వచ్చే పాటలు ఆడించిన,ఏడిపించిన,నేర్పించినా నాతో విడదీయరాని బంధం ఏర్పరుచుకుంది.

-పెమ్మరాజు అశ్విని


إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)