గిరిజనుల మధ్య భూ వివాదం : అడ్డుకోబోయిన పోలీసులపై దాడి

Telugu Lo Computer
0


తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం చంద్రాయపాలెం అటవీ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. చంద్రాయపాలెం శివారులోని 9 హెక్టార్లలోని అటవీ భూమికి సంబంధించి కొన్నేళ్లుగా రెండు గిరిజన వర్గాల మధ్య వివాదం జరుగుతోంది. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో చంద్రాయపాలెం వర్గం, బుగ్గపాడు, నాగుపల్లి, మొండివర్రె తదితర గ్రామాలకు చెందిన మరో వర్గానికి మధ్య వాగ్వాదం జరుగుతుండగా సాంబశివరావు అనే వ్యక్తి డయల్‌ 100కు ఫోన్‌ చేశారు. దీంతో సీఐ టి.కిరణ్‌తోపాటు పోలీసు సిబ్బంది నరేశ్‌, నరసింహారావు, ఇమ్రాన్‌, సత్యనారాయణలు ఘటనా స్థలానికి వెళ్లారు. గొడవకు పాల్పడుతున్న రెండో వర్గానికి నాయకత్వం వహిస్తున్న కూరం మహేందర్‌ను సీఐ అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా పలువురు గిరిజనులు అడ్డుకున్నారు. అనంతరం సీఐ, సిబ్బందిపై కర్రలు, వెదురుబద్దలతో దాడికి తెగబడ్డారు. సీఐని వెంబడించి ఆయన చొక్కాను చించివేసి కొట్టారు. ఎట్టకేలకు వారి నుంచి తప్పించుకొని ఐదుగురూ బయటపడ్డారు. విషయం తెలుసుకొని పోలీసు ఉన్నతాధికారులు కల్లూరు ఏసీపీ రఘు ఆధ్వర్యంలో సత్తుపల్లి, వైరా సబ్‌ డివిజన్‌లోని పోలీసులు, ఖమ్మం ఏఆర్‌, టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందిని రంగంలోకి దింపారు. దాడికి పాల్పడిన అనుమానిత గిరిజనులను బుగ్గపాడులో సాయంత్రం అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. మొత్తం 19 మంది మహిళలపై కేసు నమోదు చేసి రిమాండుకు పంపామని, పరారీలో ఉన్న మరికొంత మంది నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా 1986లో సదరు భూములకు సంబంధించి ప్రభుత్వం తమకు పట్టాలిచ్చిందని చంద్రాయపాలెం గిరిజనులు అంటుండగా.. 1976-77లోనే తమకు పట్టాలిచ్చారని మరో వర్గం చెబుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)