తాగునీటి సరఫరాపై ఆందోళన వద్దు !

Telugu Lo Computer
0


తెలంగాణలో మూడు ప్రధాన రిజర్వాయర్లలో సరిపడా నీటి లభ్యత ఉందని, ప్రస్తుత వేసవిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి స్పష్టం చేశారు. తాగునీటి సరఫరాపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాగునీటి సమస్య తలెత్తకుండా ఇప్పటికే 'సమ్మర్ యాక్షన్ ప్లాన్'ను రూపొందించి జిల్లాలకు నిధులు విడుదల చేయాలని చెప్పారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరాకు ఏవిధమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే బోరు బావుల ఫ్లషింగ్, పైపుల మరమ్మతులు చేపట్టడం పూర్తి చేయడం జరిగిందని చెప్పారు. నిర్వహణ పరమైన లోపాలను ఎప్పటికప్పుడు వెంటనే సవరించి నీటి సరఫరాకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రతీ రోజు గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సరఫరాపై సంబంధిత క్షేత్ర స్థాయి అధికారులు, నోడల్ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించాలన్నారు. వేసవికాల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మంజూరు చేసిన పనులన్నీ సకాలంలో పూర్తి చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ప్రధానంగా ఆపరేషన్, మెయింటెనెన్స్‌లపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఇతర రాష్ట్రాలలో ఎదురవుతున్న తాగునీటి సమస్యను మన రాష్ట్రానికి కూడా అన్వయిస్తూ ఆందోళనకరమైన వార్తా కథనాలు వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఈ సారి లోటు వర్షపాతం ఉన్నా, ఇక్కడి ప్రధాన జలాశయాలు, ఎస్సారెస్పీ, శ్రీపాద ఎల్లంపల్లి, నాగార్జున సాగర్‌తో గత సంవత్సరం మాదిరిగానే నీటి మట్టాలున్నందున ఆందోళన అవసరం లేదన్నారు. అయినప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లను రూపొందించుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. కొన్ని మున్సిపాలిటీలు, గ్రామాల్లో నిర్వహణపరంగా లోపాలొచ్చాయని.. లోపాలను పరిష్కరించినట్లు చెప్పారు. నీటి సమస్యలపై వివిధ మాధ్యమాల ద్వారా వచ్చే వార్తలపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఏప్రిల్ రెండవ వారం అనంతరం రిజర్వాయర్ల నుండి ఎమర్జెన్సీ పంపింగ్ ను చేపడతామని సి.ఎస్ తెలియచేసారు. హైదరాబాద్ మహా నగరంలో కూడా సరిపడా నీటి సరఫరా చేస్తున్నామని, అయితే, కమర్షియల్ అవసరాల నిమిత్తం డిమాండ్ ఎక్కువగా ఉందని జలమండలి అధికారులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)