తెలంగాణలో 16బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం !

Telugu Lo Computer
0


తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగింది. రేపోమాపో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ రానుందనే ప్రచారం నేపథ్యంలో కేబినెట్‌ భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రివర్గం పలు అంశాలపై దాదాపు రెండున్నర గంటలసేపు చర్చించింది. 16 కార్పొరేషన్ల ఏర్పాటుకు మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా 16 బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ముదిరాజ్‌, యాదవ, మున్నూరు కాపు, పద్మశాలి, మేరు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈబీసీలకు రెడ్డి కార్పొరేషన్‌తో పాటు వైశ్య, మైనార్టీ, సంత్‌సేవాలాల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు తీర్మానం చేశారు. అంతే కాకుండా కొత్త రేషన్‌ కార్డుల జారీకి కూడా తెలంగాణ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అర్హులైన వారందరికీ తొందరలోనే తెల్ల రేషన్‌ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. రేషన్‌ కార్డు లేకుండా ఆరోగ్యశ్రీ అమలుకు కూడా కసరత్తు చేయాలని నిర్ణయించారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లు అందించాలని తీర్మానించింది. రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.22,500 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. అంతేకాకుండా.. మహిళలకు వడ్డీలేని రుణాలతో పాటు, మహాలక్ష్మి పథకం కింద రూ.2500 ఆర్థిక సహాయంపై చర్చించారు. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలోనూ తెలంగాణ కేబినెట్‌ చర్చించినట్లు తెలుస్తోంది. ప్రొఫెసర్‌ కోదండరాం, జర్నలిస్ట్‌ అమీర్ అలీఖాన్‌ పేర్లను ఎమ్మెల్సీలుగా ప్రతిపాదిస్తూ మరోసారి గవర్నర్‌ తమిళిసైకి పంపించాలని మంత్రివర్గం తీర్మానించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)