కాంగ్రెస్ గ్యారంటీ పథకాల కు చెక్ పెట్టనున్న కేసీఆర్ ?

Telugu Lo Computer
0


వచ్చే నెల ప్రధమార్ధంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించిన కేసీఆర్ కాంగ్రెస్ గ్యారంటీ పథకాలకు చెక్ పెట్టేందుకు నిర్ణయించారు. భారీ అజెండాతో ఈ నెల 29న మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇందులో అనూహ్య నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా నేరుగా సోనియా గాంధీ హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ గ్యారంటీలను ప్రకటించారు. వీటి ద్వారా సాధారణ ప్రజలను ఆకట్టుకొని అధికారం దక్కించుకోవాలని భావిస్తోంది. ఇదే సమయంలో వరుసగా మూడో సారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలనేది సీఎం కేసీఆర్ వ్యూహం. అందులో భాగంగా కాంగ్రెస్ గ్యారంటీలకు ధీటుగా అధికారంలో ఉన్న తామే వీటీని అమలు చేయటం ద్వారా కాంగ్రెస్ కు అవకాశం లేకుండా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ నెల 29న జరిగే మంత్రివర్గ సమావేశంలో సంచలన నిర్ణయాల దిశగా కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ ప్రకటించిన గ్యాస్ ధర రాయితీకి ధీటుగా ఏకంగా ఒక్కో సిలిండర్ పైన రూ 600 -700 వరకు సబ్సిడీ ని ఇచ్చే దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. పేద కుటుంబాలకు మాత్రమే వర్తించేలా ఏటా ఆరు నుంచి 8 సిలిండర్లకు సబ్సిడీని వర్తింపచేసేలా మంత్రివర్గంలో చర్చించి ఆమోదం తెలిపేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటుగా ఇప్పుడున్న సామాజిక భద్రతా పెన్షన్ మొత్తాన్ని రూ 3,116 కి పెంచటం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న డీఏల్లో ఒకటి వెంటనే విడుదల చేస్తూనే..పీఆర్సీ నియామక ప్రక్రియకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. ఇక, ఉద్యోగులను ఆకట్టుకొనే ఐఆర్ (మధ్యంతర భృతి) ప్రకటన..సీపీఎస్ పైన నిర్ణయం దిశగా కసరత్తు కొనసాగుతోంది. ఇక, అనాధ పిల్లల కోసం ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కొత్త రేషన్ కార్డుల పంపిణీ, యువత కోసం కొత్త పథకాలు, ఉద్యోగులకు హెల్త్ స్కీం, ఇంటి స్థలాల వంటి అంశాల పైన ఈ కేబినెట్ భేటీ లో నిర్ణయాలు ఉంటాయని సమాచారం. ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోగానే విధాన పరమైన నిర్ణయాలకు ఈ కేబినెట్ లో ఆమోదం తెలిపాలని భావిస్తున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)