మొరాకోలో శిథిలాల కింద కుప్పలుగా శవాలు !

Telugu Lo Computer
0


మొరాకోలోని హై అట్లాస్‌ పర్వతాల్లో 6.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. భూకంపం ధాటికి కుప్పకూలిన భవన శిథిలాలను తొలగిస్తున్నా కొద్ది కుప్పలుగా శవాలు బయటపడుతున్నాయి. శనివారం సాయంత్రానికి భూకంప మృతుల సంఖ్య 1037కు చేరింది. అదే సమయంలో క్షతగాత్రుల సంఖ్య కూడా భారీగానే పెరుగుతున్నది. శనివారం సాయంత్రం వరకు గాయపడిన వారి సంఖ్య 1200 దాటింది. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. శుక్రవారం అర్ధరాత్రి మొరాకోలోని మర్రకేష్‌ ప్రాంతంలో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొద్ది సేపటికి 4.9 తీవ్రతతో 19 నిమిషాలపాటు పలు ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మర్రకేష్‌కు 71 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే  వెల్లడించింది. భూ అంతర్భాగంలో 18.5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని తెలిపింది. ఆల్‌ హౌజ్‌, మర్రకేష్‌, క్వార్జాజేట్‌, అజిలాల్‌ సహా పలు ప్రావిన్సుల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు వెల్లడించింది. శతాబ్దకాలంలో ఉత్తరాఫ్రికా ఈ స్థాయి భూకంపాన్ని ఇప్పటి వరకూ చవిచూడలేదని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది. మరోవైపు భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)