అద్భుతమైన క్యాచ్‌లు పట్టిన న్యూజిలాండ్‌ ఫీల్డర్లు !

Telugu Lo Computer
0


ఇంగ్లండ్‌ లోన్ సౌథాంప్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ మధ్య నిన్నజరిగిన రెండో వన్డేలో రెండు అద్భుతమైన క్యాచ్‌లు అభిమానులకు కనువిందు చేశాయి. ఇందులో మొదటిది బౌల్ట్‌ బౌలింగ్‌లో సాంట్నర్‌ పట్టగా (బెయిర్‌స్టో), రెండోది సౌథీ బౌలింగ్‌లో గ్లెన్‌ ఫిలిప్స్‌ (మొయిన్‌ అలీ) అందున్నాడు. సాంట్నర్‌ గాల్లోకి పైకి ఎగురుతూ ఒంటిచేత్తో పట్టుకున్న క్యాచ్‌ అద్భుతమైతే, అసాధ్యమైన క్యాచ్‌ను పట్టుకున్న ఫిలిప్స్‌ అత్యద్భుతం. మొయిన్‌ అలీ బ్యాట్‌ లీడింగ్‌ ఎడ్జ్‌ తీసుకుని బంతి గాల్లోకి లేవగా, చాలా దూరం నుంచి పరిగెడుతూ వచ్చి గాల్లోకి డైవ్‌ చేస్తూ ఫిలిప్స్‌ ఈ క్యాచ్‌ను అందకున్నాడు. రిస్క్‌తో కూడుకున్న ఈ క్యాచ్‌ను పట్టుకుని ఫిలిప్స్‌ పెద్ద సాహసమే చేశాడు. క్యాచ్‌ పట్టే క్రమంలో ఒకవేళ అటుఇటు అయివుంటే అతను తీవ్రంగా గాయపడేవాడు. అయితే ఫిలిప్స్‌ ఎంతో చాకచక్యంగా, ఎలాంటి దెబ్బలు తగిలించుకోకుండా ఈ ​క్యాచ్‌ను అందుకుని అందరి మన్ననలు అందుకున్నాడు. ఈ రెండు క్యాచ్‌లకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉన్నాయి. నెటిజన్లు సాంట్నర్‌ క్యాచ్‌తో పోలిస్తే ఫిలిప్స్‌ క్యాచ్‌కు ఎక్కువగా ఫిదా అవుతున్నారు. వారు ఫిలిప్స్‌ను ఫ్లయింగ్‌ బర్డ్‌తో పోలుస్తున్నారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఫీల్డర్లు అద్భుతమైన క్యాచ్‌లు అందుకున్నా, ఆ జట్టు మాత్రం 79 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. వర్షం కారణంగా 34 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. లివింగ్‌స్టోన్‌ (95 నాటౌట్‌) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో 7 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. కివీస్‌ బౌలర్లు బౌల్ట్‌ 3, సౌథీ 2, హెన్రీ, సాంట్నర్‌ తలో వికెట్‌ పడగొట్టారు. అనంతరం 227 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్‌.. ఇంగ్లీష్‌ బౌలర్లు డేవిడ్‌ విల్లే (3/34), రీస్‌ టాప్లే (3/27), మొయిన్‌ అలీ (2/30), అట్కిన్సన్‌ (1/23) ధాటికి 26.5 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలింది. కివీస్‌ ఇన్నింగ్స్‌లో డారిల్‌ మిచెల్‌ (57) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)