ఉసేన్‌ బోల్ట్‌ రికార్డును బద్దలుకొట్టిన ఎరియన్‌ నైటాన్‌ !

Telugu Lo Computer
0


మెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఎరియన్‌ నైటాన్‌, బోల్ట్‌ మాదిరే పొడుగ్గా, సన్నగా ఉంటాడు.  ట్రాక్‌లో పరుగు తీస్తుంటే మిగిలిన వాళ్లు అతడి వెనుకే! నిజానికి నైటాన్‌ చిన్నప్పటి నుంచి రన్నర్‌ కాదు. ఫుట్‌బాల్‌ ఆటగాడు.  ఈ ఆటలో చాలాకాలం కొనసాగిన నైటాన్‌, తనలో ఉన్న మెరుపు వేగాన్ని ఆలస్యంగా గుర్తించాడు. లేటుగా ట్రాక్‌లోకి వచ్చినా ప్రస్తుత స్ప్రింట్‌ స్టార్లు నోవా లేల్స్‌ లాంటి వాళ్లకు కంగారు పుట్టిస్తున్నాడు. ఫ్లోరిడా యూనివర్సిటీ కోచ్‌ మైక్‌ హోలోవె శిక్షణలో రాటుదేలిన ఈ కుర్రాడు.. 200 మీటర్ల పరుగులో ప్రత్యర్థులకు సవాల్‌ విసురుతున్నాడు. 2020లో జూనియర్‌ ఒలింపిక్‌ క్రీడల్లో 200 మీటర్ల పరుగును 20.33 సెకన్లలో పూర్తి చేసి 15-16 వయసు విభాగంలో కొత్త రికార్డు నెలకొల్పాడు. జూనియర్‌ స్థాయిలో తన ముద్ర వేసిన ఈ కుర్రాడు.. గతేడాది యూజీన్‌లో జరిగిన ప్రపంచ అండర్‌-20 అథ్లెటిక్స్‌లో మరో సంచలనం సృష్టించాడు. 200 మీటర్ల పరుగును 19.49 సెకన్లలో పూర్తి చేసి ఉసేన్‌ బోల్ట్‌ పేరిట 18 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. 200 మీటర్ల పరుగును 20 సెకన్లలోపు పరుగెత్తిన తొలి అమెరికా అథ్లెట్‌గానూ అతడు ఘనత సాధించాడు. గత రెండేళ్లుగా డైమండ్‌ లీగ్‌లో 200 పరుగులో అతడికి ఎదురే లేదు. ప్రపంచ అథ్లెటిక్స్‌ కాంటినెంటల్‌ టూర్‌లోనూ నైటాన్‌దే పైచేయి. ఈ వరుస విజయాలతోనే అతడు రెండుసార్లు ప్రపంచ అథ్లెటిక్స్‌ 'రైజింగ్‌ స్టార్‌' అవార్డును దక్కించుకున్నాడు. 100 మీటర్ల పరుగులోనూ నైటాన్‌ సత్తా చాటుతున్నా అతడి ప్రధాన దృష్టి 200 మీ. మీదే కేంద్రీకరించాడు. అండర్‌-20 కేటగిరిలో 200 మీటర్ల పరుగులో పదకొండుసార్లు తన రికార్డును తానే సవరించడం నైటాన్‌ సత్తాకు నిదర్శనం. అందుకే ప్రస్తుతం ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో 200 మీటర్ల పరుగులో ఈ కుర్రాడు ఫేవరెట్‌గా బరిలో దిగుతున్నాడు. గతేడాది 19.31 సెకన్లలో లక్ష్యాన్ని చేరి మైకేల్‌ జాన్సన్‌ రికార్డును బద్దలు కొట్టిన నోవా లేల్స్‌కు ఈసారి నైటాన్‌తో పోటీపడి గెలవడం కష్టమే. ట్రాక్‌ మీదే కాదు రోడ్డు మీదా దూసుకెళ్లడం నైటాన్‌కు సరదా. స్పోర్ట్స్‌ కారుల్లో షికారు కొడుతూ ట్రాక్‌ సెంటర్లకు వెళుతుంటాడీ అమెరికా టీనేజర్‌. ఏదో ఒకరోజు మెక్‌లారెన్, లాంబోర్గిని కార్లు కొనాలనేది ఇతడి ఆశ. అంతేకాదు ఒకటి కాదు రెండు ఒలింపిక్స్‌ స్వర్ణాలు నెగ్గాలనేది నైటాన్‌ లక్ష్యం. 

Post a Comment

0Comments

Post a Comment (0)