గల్లంతైన జలాంతర్గామిలో ప్రముఖులు !

Telugu Lo Computer
0


టైటానిక్‌ మహానౌక శకలాలను వీక్షించేందుకు బయల్దేరి ఆచూకీ గల్లంతైన జలాంతర్గామిలో బిలియనీర్లు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్‌ ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. పాకిస్తాన్ లోని అత్యంత సంపన్నుల్లో ఒకరైన షాజాదా దావూద్‌ (48), ఆయన కుమారుడు సులేమాన్‌ (19) ఉన్నట్లు గుర్తించారు. ఈ మినీ జలాంతర్గామిని నిర్వహిస్తున్న 'ఓషన్‌గేట్‌' వ్యవస్థాపకుడు స్టాక్టన్‌ రష్‌ కూడా యాత్రికుల్లో ఒకరని తేలింది. వీరితోపాటు యూకే-యూఏఈ బిలియనీర్‌ హమీష్‌ హార్డింగ్‌, ఫ్రాన్స్‌కు చెందిన పైలట్‌ పౌల్‌ హెన్రీ నార్జియోలెట్‌ కూడా ఉన్నాడు. షాజాద్‌ దావూద్‌ పాకిస్థాన్‌లోని అత్యంత సంపన్నుల్లో ఒకరు. ఆ దేశంలోని అతిపెద్ద కంపెనీ అయిన ఇంగ్రో కార్పొరేషన్‌కు వైస్‌ ఛైర్మన్‌. పారిశ్రామిక వేత్త హుస్సేనీ దావూద్‌ కుమారుడు. ఇంగ్రో కార్పొరేషన్‌ కంపెనీ పాకిస్థాన్‌లో ఎరువులు, వాహన, ఇంధన, డిజిటల్‌ టెక్నాలజీలో భారీగా పెట్టుబడులు పెట్టింది. దావూద్‌కు యూకేలోని ఉన్నత వర్గాలతో మంచి సంబంధాలున్నాయి. ఆయన సర్రేలోని ఓ భవనంలో భార్య క్రిస్టిన్‌తో కలిసి నివసిస్తున్నాడు. ఆయనతోపాటే కుమారుడు సులేమాన్‌, కుమార్తె అలీనా కూడా ఉంటున్నారు. షాజాద్‌ ప్రిన్సెస్‌ ట్రస్ట్‌ ఇంటర్నెషనల్‌ బోర్డులో కూడా సభ్యుడు. గలంతైన జలాంతర్గామిలో షాజాద్‌, సులేమాన్‌ ఉన్న విషయాన్ని ఆయన కుటుంబం ధ్రువీకరించింది. ఆయన సురక్షితంగా రావాలని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించింది. 'ఓషన్‌ గేట్‌' వ్యవస్థాపకుడు కూడా ఈ ప్రమాదంలో చిక్కుకొన్నారు. ప్రస్తుతం ఆయన కంపెనీ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. రష్‌ సుశిక్షితుడైన పైలట్‌ కూడా. ఓషన్‌ గేట్‌ ఫౌండేషన్‌ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. యాక్షన్‌ ఏవియేషన్‌ ఛైర్మన్‌ హమీష్‌ కూడా గల్లంతైన వారిలో ఉన్నారు. ఈ ప్రమాదంలో అందరి కంటే ముందు ఈయన పేరే వెల్లడైంది. హమీష్‌ కంపెనీ ప్రధాన కార్యాలయం యూఏఈలో ఉంది. వైమానిక రంగంలో కొనుగోళ్లు, అమ్మకాలతోపాటు వివిధ రకాల సేవలను ఈ కంపెనీ అందిస్తోంది. ప్రపంచాన్ని విమానంలో అతివేగంగా చుట్టివచ్చిన వ్యక్తిగా ఆయన పేరిట గిన్నిస్‌ రికార్డు ఉంది. బ్లూ ఆరిజిన్‌లో అంతరిక్ష యాత్ర కూడా చేశారు. ఈ మినీ జలాంతర్గామి పైలట్‌ పౌల్‌ హెన్రీ ఫ్రెంచ్‌ నౌకాదళంలో కమాండర్‌గా పనిచేశారు. ఆయనకు నావికుడిగా 25ఏళ్ల అనుభవం ఉంది. అతడి సర్వీస్‌లో భాగంగా సముద్రంలోని అత్యంత లోతైన ప్రదేశాల్లో పనిచేసే బృందానికి కెప్టెన్‌గా వ్యవహరించాడు. అనంతరం అతడు 'ది ఫ్రెంచ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రీసెర్చి అండ్‌ ఎక్సప్లాయిటేషన్‌ ఆఫ్‌ సీ'లో చేరాడు. ప్రపంచ వ్యాప్తంగా పలు సైంటిఫిక్‌ పర్యటనలకు వెళ్లాడు. ఓషన్‌ గేట్‌ చేపట్టిన ఎనిమిది రోజుల సాహస యాత్రలో టైటానిక్‌ శకలాల సందర్శన కూడా ఓ భాగం. న్యూఫౌండ్‌లాండ్‌ నుంచి ఈ యాత్ర మొదలైంది. 400 నాటికల్‌ మైళ్ల దూరంలోని టైటానిక్‌ శకలాల వద్దకు వెళ్లి రావాల్సి ఉంది. తొలి రెండు గంటల ప్రయాణం సాఫీగానే సాగింది. కానీ, ఆ తర్వాత దీనికి సపోర్టింగ్‌ షిప్‌గా వచ్చిన పోలార్‌ ప్రిన్స్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఆ తర్వాత కొద్దిసేపటికి గాలింపు చర్యలు మొదలుపెట్టారు. సోమవారం మధ్యాహ్నం నాటికి ఆ మినీ జలాంతర్గామిలో దాదాపు 70 గంటలకు సరిపడా ఆక్సిజన్‌ ఉంది. ఇది శుక్రవారం వరకు అందులోని వారికి సరిపోవచ్చని అంచనావేస్తున్నారు. కానీ, ఈ జలాంతర్గామి సంబంధాలు తెగిపోయిన చోట సముద్రం చాలా లోతుగా ఉంది. ఇదే గాలింపులో అసలైన సవాలు. వాస్తవానికి టైటానిక్‌ శిథిలాలు 13,000 అడుగుల లోతులో ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)