చెన్నైలో ప్రమాదాలు జరిగే రోడ్డుపై హిజ్రాతో పూజలు !

Telugu Lo Computer
0


తమిళనాడు రాజధాని చెన్నైలో ఒక ట్రాఫిక్‌ పోలీస్‌ మూఢ నమ్మకాలకు పోయాడు. ఎక్కువ ప్రమాదాలు జరిగే రోడ్డుపై హిజ్రాతో పూజలు చేయించాడు. తద్వారా దుష్ట శక్తి తొలగిపోతుందని భావించాడు. అయితే ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ఆ ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారిపై చర్యలు చేపట్టారు. వనాగారం, మధురవాయల్‌ సమీపంలోని రహదారిలో పలు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ ఎస్‌ఐ పళని సొంత నిర్ణయం తీసుకున్నాడు. శుక్రవారం ఉదయం ఒక హిజ్రాను పోలీస్‌ వాహనంలో అక్కడకు రప్పించాడు. ఎక్కువ ప్రమాదాలు జరిగే రోడ్డు ప్రాంతంలో పూజలు చేయించాడు. ఆ హిజ్రా గుమ్మడికాయ, నిమ్మకాయలతో ఆ రోడ్డుకు దిష్టి తీసింది. అనంతరం వాటిని నేలకేసి కొట్టింది. కాగా, ఈ పూజకు సంబంధించిన ఫొటోలు, వీడియో క్లిప్‌లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో ఇది పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ అడిషనల్‌ కమిషనర్‌ కపిల్‌ కుమార్‌ శరత్కర్‌ ఈ సంఘటనపై స్పందించారు. ఆ అధికారి తన వృత్తికి వ్యతిరేకంగా వ్యవహించడంతోపాటు వ్యక్తిగత నమ్మకంతో ఆ విధంగా చేయడాన్ని తప్పుపట్టారు. రోడ్డు ప్రమాదాలకు దారితీసే కారణాలను శాస్త్రీయంగా విశ్లేషించి నివారణకు చర్యలు చేపట్టకుండా దుష్టశక్తిని తరిమే పేరుతో ఇలాంటి పూజలు చేయడం సరికాదని పేర్కొన్నారు. ట్రాఫిక్‌ ఎస్‌ఐ పళనిని ఆ విధుల నుంచి తప్పించడంతోపాటు కంట్రోల్‌ రూమ్‌కు రిపోర్ట్‌ చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)