'ఐదు గ్యారంటీల'కు కేబినెట్‌ ఆమోదం !

Telugu Lo Computer
0


తాము ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి ఉన్నామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఐదు గ్యారంటీలను అమలు చేసేందుకు కేబినెట్‌ నిర్ణయించిందన్నారు. కులమత వివక్ష లేకుండా వీటిని అమలు చేస్తామన్నారు. ఇందులో కొన్ని పథకాలను తక్షణమే అమలు చేసేందుకు ఏర్పాట్లు చేశామని.. మహిళల కోసం తీసుకువస్తున్న గృహలక్ష్మి పథకాన్ని మాత్రం ఆగస్టు 15న ప్రారంభిస్తామని సిద్ధరామయ్య వెల్లడించారు. 'కేబినెట్‌ సమావేశంలో భాగంగా ఎన్నికల ముందు ఇచ్చిన ఐదు హామీలపై విస్తృతంగా చర్చించాం. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ ఐదు హామీలను అమలు చేయాలని నిర్ణయించాం' అని సిద్ధరామయ్య పేర్కొన్నారు. తనతోపాటు ఉపముఖ్యమంత్రి శివకుమార్‌ కూడా గ్యారంటీ కార్డులపై సంతకాలు చేశారని చెప్పిన ఆయన.. ఈ హామీలను నెరవేర్చడంతోపాటు వాటిని ప్రజలకు అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ఈ పథకాలకు సంబంధించిన ప్రాథమిక వివరాలను వెల్లడించారు. 'గృహజ్యోతి' కింద రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు అందజేస్తాం. ఈ పథకాన్ని జులై 1 నుంచి అమలు చేస్తాం. కానీ, అంతవరకు పెండింగులో ఉన్న బిల్లులు మాత్రం చెల్లించాలి. గృహలక్ష్మి పథకం కింద కుటుంబంలోని మహిళకు (కుటుంబ పెద్ద) నెలకు రూ.2వేలు అందజేస్తాం. ఆగస్టు 15 నుంచి ఈ పథకం ప్రారంభమతుంది. ఇందుకోసం జూన్‌ 15 నుంచి జులై 15వరకు దరఖాస్తులు స్వీకరిస్తాం. మహిళలు ఆధార్‌, బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. వారి అకౌంట్లలో ఆగస్టు 15నుంచి డబ్బులు జమ అవుతాయి. 'అన్నభాగ్య' పథకం కింద బీపీఎల్‌ కుటుంబంలోని ప్రతి ఒక్కరికి పది కిలోల చొప్పున బియ్యం ఉచితంగా అందజేస్తాం. జులై 1 దీన్ని ప్రారంభిస్తాం. యువనిధి పథకం ద్వారా నిరుద్యోగులకు 24 నెలల పాటు భృతి అందజేస్తాం. డిగ్రీ అభ్యర్థులకు రూ.3వేలు, డిప్లొమా పూర్తి చేసిన వారికి రూ.1500 ఇస్తాం. 2022-23లో పాసైన వారికి ప్రతినెల వీటిని అందజేస్తాం. డిగ్రీ పూర్తయిన ఆరు నెలల తర్వాత అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. శక్తి  పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. జూన్‌ 11 నుంచి ఇది అమలులోకి వస్తుంది. ఏసీ, లగ్జరీ మినహా అన్ని బస్సుల్లో మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితం.

Post a Comment

0Comments

Post a Comment (0)