అవినాష్ రెడ్డికి భారీ ఊరట !

Telugu Lo Computer
0


తెలంగాణ హైకోర్టులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఈ మేరకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై శనివారం కూడా తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. నిన్న అవినాష్, సునీత లాయర్లు వాదనలు వినిపించగా ఇవాళ సీబీఐ తన వాదనలని వినిపించింది. ఈ క్రమంలో అవినాష్ రెడ్డి బెయిల్ పై తీర్పును బుధవారం వెల్లడించనుంది. అయితే అప్పటివరకు తనపై కఠిన చర్యలు తీసుకోకుండా సీబీఐని ఆదేశించాలని అవినాష్ రెడ్డి కోరారు. అవినాష్ తల్లి అనారోగ్యంగా ఉన్నందున అరెస్టు చేయొద్దని హైకోర్టు మధ్యంతర తీర్పు వెల్లడించింది. దీనితో అవినాష్ రెడ్డికి భారీ ఊరట లభించినట్లయింది. అయితే తుది తీర్పును బుధవారం వెల్లడించనుంది కోర్టు. అప్పటివరకు అవినాష్ రెడ్డిపై చర్యలు తీసుకోడానికి సీబీఐకి అవకాశం లేకుండా పోయింది. ఇదిలా ఉంటే వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈరోజు వాదనలో సీబీఐ లాయర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు సహకరించడం లేదు. నోటీసులు ఇచ్చిన ప్రతిసారీ ఏదో ఒక సాకు చూపుతున్నారు. వివేకా హత్యకు నెల రోజుల ముందే ప్లాన్ జరిగింది. వివేకా హత్యలో రాజకీయ కోణం ఉందని సీబీఐ ఆరోపించింది. ఎంపీగా అనధికారికంగా ముందే ప్రకటించారని స్టేట్మెంట్స్ చెబుతున్నాయి కదా ? అవినాష్ అభ్యర్థిత్వాన్ని అందరూ సమర్ధించినట్లు స్టేట్మెంట్స్ చెబుతున్నాయి. రాజకీయంగా అవినాష్ బలవంతుడని మీరే చెబుతున్నారు. అలాంటప్పుడు వివేకాను చంపాల్సిన అవసరం ఏముందని సీబీఐ లాయర్ ను జడ్జి ప్రశ్నించారు. వైఎస్ భాస్కర్ రెడ్డిని, ఉదయ్ కుమార్ రెడ్డిలను ఎందుకు అరెస్ట్ చేశారు? వారి నుంచి సమాచారం రాబట్టారా? అని కోర్టు ప్రశ్నించింది. కాగా వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ పై హైకోర్టులో శుక్రవారం కూడా వాడీవేడి వాదనలు కొనసాగాయి. ఉదయం సుమారు 11 గంటలకు ప్రారంభమైన వాదనలు సాయంత్రం 6 గంటల వరకు కొనసాగాయి. అవినాష్, సునీత తరపు లాయర్లు తమ వాదనలను వినిపించారు. 5 గంటల పాటు అవినాష్ లాయర్, ఒక గంట పాటు సునీత తరపు లాయర్ వాదనలు వినిపించారు. ఈ కేసు విచారణలో నిన్న వాదనలు జరిగాయిలా అసలు తనకు ఈ కేసు గురించి తెలియదని, కేసు గురించి చెప్పాలని అవినాష్ లాయర్ ను జడ్జి అడిగారు.  దీనితో హత్య జరిగిన రోజు నుంచి చోటు చేసుకున్న పరిణామాలను అవినాష్ లాయర్ వివరించారు. కేసులో సీబీఐ 4 నెలలకు FIR నమోదు చేసిందని..అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని అవినాష్ లాయర్ తెలిపారు. అలాగే అవినాష్ రెడ్డి నిందితుడని సీబీఐ ఎక్కడా పేర్కొనలేదని లాయర్ పేర్కొన్నారు. ఏ1 గంగిరెడ్డితో వివేకాకు విభేదాలున్నాయని అవినాష్ లాయర్ ఉమామహేశ్వర్ రావు వాదనలు వినిపించారు. 'గుండెపోటు అన్నంత మాత్రాన నేరం చేసినట్టు కాదు. అవినాష్ వైద్యుడో పోలీస్ అధికారో కాదు కదా? సునీల్, ఉమా శంకర్ కు వివేకాతో వ్యాపారంలో విభేదాలున్నాయి. తమ కుటుంబం మహిళల విషయంలో కూడా వివేకాకు కోపం ఉంది. డ్రైవర్ గా దస్తగిరిని తొలగించిన వివేకా ప్రసాద్ ను పెట్టుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి అవినాష్ రెడ్డే కారణమని వివేకా భావించారు. వివేకా ఓటమికి కారణాలను సాక్షులే వివరించారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎంపీ టికెట్ పై అవినాష్ ను సీబీఐ అనుమానిస్తుందని' అవినాష్ లాయర్ ఉమామహేశ్వర్ రావు వాదనలు వినిపించారు. అయితే అవినాష్, సునీత, సీబీఐ తరపు లాయర్లు వాదనలు వినిపించగా కోర్టు బుధవారం తీర్పును వెల్లడిస్తానని పేర్కొంది. అయితే బుధవారం అవినాష్ రెడ్డికి ఊరటగా తుది తీర్పు వస్తుందా? లేదా అనేది ఉత్కంఠ నెలకొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)