తరుముతూ, వెంటాడి కొట్టి చంపారు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో ముగ్గురు వ్యక్తులు ఓ యువకుడిని తరుముతూ, వెంటాడి కొట్టి చంపేశారు.  డీఎస్పీ కేశప్ప, రూరల్‌ సీఐ సత్యనారాయణ కథనం మేరకు.. శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం కోటూరుకు చెందిన అక్రమ్‌ (25) మదనపల్లెలోని నక్కలదిన్నెలో ఉంటూ స్థానిక సురభి కాలనీలోని వెల్డింగ్‌ దుకాణంలో పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేసే అక్రమ్‌, ఖాదర్‌వల్లి, డ్రైవర్‌ రెడ్డిబాషా, కార్పెంటర్‌ బషీర్‌, వాహనాలు శుభ్రం చేసే సుధాకర్‌, నక్కలదిన్నెకు చెందిన ఆటో డ్రైవర్‌ వీరనాగులు కలసి ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో కర్ణాటకలోని రాయల్పాడుకు మద్యం సేవించేందుకు ఆటోలో వెళ్లారు. తిరిగి వచ్చేప్పుడు రాయల్పాడు సమీపంలో ఉన్న బంకులో ఆటోలో పెట్రోలు పోయించుకొని బిల్లు కోసం బంకు సిబ్బందితో గొడవపడ్డారు. అదే సమయంలో అక్కడికి కారులో వచ్చిన ముగ్గురు అడ్డుగా ఉన్న ఆటోను తీయాలని కోరారు. దీంతో ఆటోలో ఉన్న అక్రమ్‌, రెడ్డిబాషా వారిని తిట్టారు. బంకు సిబ్బంది వారిని వారించి పంపే ప్రయత్నం చేశారు. తాము పులివెందుల వాళ్లమని, వదిలేది లేదంటూ ఆటోలో ఉన్న వారిని ఆ ముగ్గురూ హెచ్చరించారు. ఆ తరవాత పులివెందులకు చెందిన వారిగా చెప్పుకున్న ఆ వ్యక్తులు కారులో ఆటోను వెంబడించి కర్ణాటక సరిహద్దుల్లోని ఉగ్రారంపల్లె వద్ద కారును ఆటోకు అడ్డుగా నిలిపి ఆటోలోని వారిని తీవ్రంగా కొట్టారు. ఈ క్రమంలో అక్రమ్‌ తప్పించుకున్నాడు. దీంతో అక్రమ్‌ ఎక్కడున్నాడో చెప్పాలంటూ రెడ్డి బాషాని ఆ ముగ్గురూ అరగంట పాటు కొట్టారు. వీరనాగులు ప్రాధేయపడటంతో వదిలేశారు. మర్నాడు అక్రమ్‌ కోసం స్నేహితులు ఆటోలో తిరిగి గాలించినా ఆచూకి లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సోమవారం ఉదయం మదనపల్లె రూరల్‌ మర్రిమాను సమీపంలో అక్రమ్‌ మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి తల వెనుక భాగంలో బలమైన గాయం ఉండటంతో అతన్ని కొట్టి చంపినట్లు నిర్ధారించుకొని మృతదేహాన్ని పోలీసులు శవపరీక్షకు తరలించారు. ఆ అయిదుగురూ ఇచ్చిన వివరాల మేరకు అక్రమ్‌ను పులివెందులకు చెందిన వారిగా చెప్పుకున్న ముగ్గురు వ్యక్తులే హత్య చేసినట్లు నిర్ధారించుకుని హత్య కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. కారు నంబరు ఆధారంగా నిందితులు వైయస్‌ఆర్‌ జిల్లా సింహాద్రిపురానికి చెందిన వారిగా గుర్తించి ఒక బృందాన్ని అక్కడికి పంపామన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)