కొలువుదీరిన కొత్త మంత్రివర్గం

Telugu Lo Computer
0


కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సారథ్యంలోని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. కొత్తగా 24 మంది శాసన సభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 11:45 నిమిషాలకు బెంగళూరులోని రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమం ఆరంభమైంది. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. తొలిదశలో వారిద్దరితో పాటు ఎనిమిది- డాక్టర్ జీ పరమేశ్వర, కే హెచ్‌ మునియప్ప, కేజే జార్జ్, ఎంబీ పాటిల్, సతీష్ జార్కిహోలి, ప్రియాంక్ ఖర్గే, రామలింగారెడ్డి, జమీర్ అహ్మద్ ఖాన్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారికి శాఖలను ఇంకా కేటాయించలేదు. ఈరోజు మంత్రివర్గాన్ని విస్తరించారు సిద్ధరామయ్య. కొత్తగా 24 మందిని తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సహా ఇదివరకే ప్రమాణం చేసిన ఎనిమిదిని పరిగణనలోకి తీసుకుంటే మొత్తం మంత్రుల సంఖ్య 34కు చేరినట్టయింది. మంత్రివర్గ విస్తరణలో సిద్ధరామయ్య- డీకే శివకుమార్ వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇచ్చారు. హెచ్‌కే పాటిల్-గదగ్ (నామ్‌ధారి రెడ్డి), కృష్ణ బైరేగౌడ-బెంగళూరు (వక్కలిగ), ఎన్ చలువరాయస్వామి- మండ్య (వక్కలిగ), కే వెంకటేష్- మైసూరు (వక్కలిగ), డాక్టర్ హెచ్‌సీ మహదేవప్ప - మైసూరు (ఎస్సీ), ఈశ్వర్ ఖండ్రే- బీదర్ (బంజిగ వీరశైవ లింగాయత్), క్యాథసంద్ర నంజన్న రాజన్న- తుమకూరు (ఎస్టీ), దినేష్ గుండూరావు- బెంగళూరు (బ్రాహ్మణ), శరణ బసప్ప దర్శనాపుర- యాద్గిర్ (రెడ్డి లింగాయత్) ప్రమాణ స్వీకారం చేశారు. శివానంద పాటిల్- విజయపురా (పంచమశాలి లింగాయత్), తిమ్మాపుర రామప్ప బాలప్ప- బాగల్ కోటె (ఎస్సీ), ఎస్ ఎస్ మల్లికార్జున- దావణగెరె (సదర్ లింగాయత్), తంగడగి శివరాజ్ శానప్ప- కొప్పల్ (ఎస్సీ-భోవి), డాక్టర్ శరణ ప్రకాష్ రుద్రప్ప పాటిల్- కలబురగి (ఆది బంజిగ లింగాయత్), మంకాల్ వైద్య- ఉత్తర కన్నడ (బీసీ-మొగవీర), లక్ష్మీ హెబ్బాళ్‌కర్- బెళగావి (పంచమశాలి లింగాయత్), రహీం ఖాన్- బీదర్ (ముస్లిం), డీ సుధాకర్- చిత్రదుర్గ (జైన).. ప్రమాణ స్వీకారం చేశారు. సంతోష్ ఎల్ లాడ్- ధార్వాడ (బీసీ- మరాఠీ), ఎన్ఎస్ బోస్ రాజు- రాయచూర్ (బీసీ- క్షత్రియ), బైరాతి సురేష్- బెంగళూరు (బీసీ- కురుబ), మధు బంగారప్ప- శివమొగ్గ (బీసీ-ఈడిగ), డాక్టర్ ఎంసీ సుధాకర్- చిక్కబళ్లాపూర్ (వక్కలిగ), బీ నాగేంద్ర- బళ్లారి (ఎస్టీ) ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి అండగా ఉన్న లింగాయత్, వక్కలిగ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. లింగాయత్‌ సామాజిక వర్గానికి చెందిన ఎనిమిదికి మంత్రివర్గంలో చోటు లభించింది. వక్కలిగ-5, ఎస్సీ-5, ఎస్టీ-3, కురుబ-2, ముస్లిం-3 మంత్రిపదవులు కేటాయించారు. బ్రాహ్మణ, క్రైస్తవ, జైన, మరాఠీ, భోవి, మొగవీర, ఈడిగ, ఓబీసీ, రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన వారిని ఒక్కొక్కరు చొప్పున మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఈ సాయంత్రానికి వారికి శాఖలను కేటాయించే అవకాశం ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)