పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రధానిపై అనర్హత వేటు !

Telugu Lo Computer
0


పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రధాన మంత్రి సర్దార్ తన్వీర్ ఇల్యాస్‌పై అనర్హత వేటు పడింది. ఆయనకు పదవీ గండం ఏర్పడింది. ప్రధానిగా పదవిని కోల్పోవడం ఖాయమైనట్టే. కోర్టు ధిక్కారణ కేసులో తన్వీర్ ఇల్యాస్ దోషిగా తేలారు. ఈ మేరకు పీఓకే హైకోర్టు తుది తీర్పును వినిపించింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆయన దోషిగా తేలినట్లు ప్రకటించింది. కోర్టు ద్వారా అనర్హత వేటుకు గురైన పీఓకే తొలి ప్రధాని ఆయనే. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్‌కు చెందిన నాయకుడాయన. పీఓకేకు 14వ ప్రధాని. రావల్‌కోట్ ఆయన స్వస్థలం. బహిరంగ సభల్లో న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు. ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతుడైన తరువాత జ్యుడీషియరీ వ్యవస్థపై బహిరంగ సభల్లో ఘాటు విమర్శలు చేశారు. కిందటి వారం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో నిర్వహించిన సభలో ఆయన పరోక్షంగా జ్యుడీషియరీ వ్యవస్థను విమర్శించారు. అప్పట్లో అవి సంచలనం రేపాయి. ఆయనపై కేసులు నమోదయ్యాయి. వాటని విచారణకు స్వీకరించింది ఆజాద్ జమ్మూ కాశ్మీర్ హైకోర్టు. జస్టిస్ చౌదరి ఖాలిద్ రషీద్ సారథ్యంలోని పూర్తిస్థాయి ధర్మాసనం వాదోపవాదాలను ఆలకించింది. అనంతరం తన్వీర్ ఇల్యాస్‌ను దోషిగా తేల్చింది. ఆయనపై అనర్హత వేటు వేసింది. అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఇల్యాస్ తన ప్రధానమంత్రి పదవిని కోల్పోనున్నారు. ప్రధాని తన్వీర్ ఇలియాస్ నేరుగా ఉన్నత న్యాయవ్యవస్థను బెదిరించారని జస్టిస్ ఖాలిద్ రషీద్ చెప్పారు. తీర్పు కాపీని ఆయన చదివి వినిపించారు. బహిరంగ సభల్లో ఆయన ప్రసంగం జ్యుడీషియరీ వ్యవస్థను అవమానించినట్లుగా తాము భావిస్తోన్నామని అన్నారు. ఆయన చేసిన విమర్శలు అనుచితమైనవగా, అవమానకరమైనవిగా నిర్ధారించినట్లు చెప్పారు. అసభ్యకరమైన పదజాలాన్ని ఆయన వాడినట్లు విచారణలో తేలిందని చెప్పారు. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ కేసులో ప్రధాని తన్వీర్ ఇల్యాస్‌ను దోషిగా గుర్తించినట్లు చెప్పారు. అనర్హత వేటుకు ఆయన అర్హుడని అన్నారు. కాగా- పీఓకేకు సంబంధించినంత వరకు అనర్హత వేటుకు గురైన తొలి ప్రధాని ఆయనే అయినప్పటికీ- పాకిస్తాన్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఈ జాబితా మరింత పెరుగుతుంది. ఇద్దరు ప్రధానులు అనర్హత వేటును ఎదుర్కొన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)