జగన్ కాన్వాయ్‌కు అడ్డుపడ్డ రైతులు

Telugu Lo Computer
0



ఆంధ్రప్రదేశ్ లోని శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలం పోతుల నాగేపల్లి జగనన్న కాలనీ వద్ద బుధవారం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కాన్వాయ్‌ను కొందరు రైతులు అడ్డుకున్నారు. అనంతపురం జిల్లాలో జగనన్న విద్యాదీవెన కార్యక్రమానికి విచ్చేసిన సీఎం తిరుగు ప్రయాణంలో రోడ్డు మార్గంలో ధర్మవరం మీదుగా వెళ్తున్న విషయం తెలుసుకున్న బాధిత రైతులు ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. తుంపర్తి, మోటుమర్ల గ్రామాలకు చెందిన వీరు ఒక్కసారిగా రహదారి పైకి చేరుకొని.. తమకు పరిహారం ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఈ హఠాత్పరిణామంతో కాన్వాయ్‌లోని సెక్యూరిటీ సిబ్బంది కంగుతిన్నారు. రైతులు కాన్వాయ్‌ను అడ్డుకున్న ప్రాంతంలో స్థానిక కానిస్టేబుల్‌ ఒక్కరే విధుల్లో ఉన్నారు. దీంతో కాన్వాయ్‌లోని వాహనం నుంచి భద్రతా సిబ్బంది కిందకు దిగి రైతులను పక్కకు లాగేయగా ఈలోపు సీఎం వాహనం వారిని దాటుకుని వెళ్లిపోయింది. దీంతో తమకు ఇక న్యాయం చేసేదెవరంటూ తుంపర్తి గ్రామానికి చెందిన గంగమ్మ, రాజేశ్వరి రోడ్డుపై పొర్లుతూ విలపించడం చూపరులకు కంటతడి పెట్టించింది. రైతులు నిరసనకు దిగడంతో ఈలోపు వచ్చిన స్థానిక పోలీసులు వారిని అక్కడినుంచి పంపించేశారు. ధర్మవరం మండలం పోతుల నాగేపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో ధర్మవరం పట్టణవాసులకు ఇళ్లస్థలాల కోసం 2018లో తెదేపా ప్రభుత్వ హయాంలో తుంపర్తి, మోటుమర్ల గ్రామానికి చెందిన 72 మంది రైతుల నుంచి 210 ఎకరాల భూమి సేకరించారు. ఎకరాకు రూ. 5 లక్షల పరిహారం, ఒక్కో పట్టాదారు పాసు పుస్తకానికి ఆర్‌ అండ్‌ ఆర్‌ కింద రూ. 5 లక్షలు ఇచ్చేవిధంగా అప్పటి అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 27 మంది రైతులు పరిహారం తీసుకున్నారు. మరో 45 మంది రైతులు తమకు పరిహారం పెంచాలని డిమాండు చేస్తూ నాడు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో అధికారులు రైతులకు మంజూరైన పరిహారాన్ని కోర్టులో జమ చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమకు పరిహారం ఇప్పించాలని బాధిత రైతులు పలుమార్లు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వద్ద మొర పెట్టుకున్నారు. సీఎంను కలిసేందుకు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. పోతులనాగేపల్లి వద్ద గత ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలను వైకాపా ప్రభుత్వం వచ్చాక రద్దు చేసి మళ్లీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేతుల మీదుగా కొత్తగా జగనన్న కాలనీ నిర్మాణం చేపట్టారు. అయినా తమకు నాలుగేళ్లుగా న్యాయం జరగలేదని సీఎంకు తమ మొర వినిపించాలని రైతులు యత్నించినా ఫలించకపోవడంతో కన్నీటి పర్యంతమయ్యారు.


Post a Comment

0Comments

Post a Comment (0)