రేపటి నుంచి రాయపూర్‌లో కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు

Telugu Lo Computer
0


ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్‌లో ఫిబ్రవరి 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలను నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. మూడు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు అన్ని రాష్ట్రాల నుంచి 9915 మంది పీసీసీ ప్రతినిధులు, 1338 మంది ఏఐసీసీ ప్రతినిధులు, 487 కోఆప్టెడ్ సభ్యులు పాల్గొననున్నారు. అందులో ఏపీ నుంచి 350, తెలంగాణ నుంచి 238 పీసీసీ ప్రతినిధులు పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ప్రకారం 12 మంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ  సభ్యులను ఏఐసీసీ సభ్యులు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎన్నికలు నిర్వహించే అంశంపై ఫిబ్రవరి 24న తొలిరోజు కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకోనుంది. ప్రవేశపెట్టనున్న తీర్మానాలను రేపు స్టీరింగ్ కమిటీ ఖరారు చేయనుంది. అలాగే.. మూడు రోజుల ప్లీనరీ సమావేశాల అజెండాను కూడా స్టీరింగ్ కమిటీ ఖరారు చేయనుంది. శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ సబ్జెక్ట్స్ కమిటీ.. ప్లీనరీ సమావేశాల్లో ఆమోదించనున్న తీర్మానాలకు తుది రూపునివ్వనుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యుసీ)కి ఎన్నికలు జరుగుతాయా లేదా అన్నది రేపు స్టీరింగ్ కమిటీ నిర్ణయిస్తుంది. చివరి రోజున నిర్వహించే భారీ బహిరంగ సభతో ఈ సమావేశాలు ముగియనున్నాయి. ఈ సభలో అగ్రనేతలు ప్రసంగించనున్నారు. ప్లీనరీ సమావేశాలకు హాజరయ్యే ఏఐసీసీ ప్రతినిధుల్లో 235 మంది మహిళా ప్రతినిధులు కాగా, మరో 501 మంది ప్రతినిధులు 50 ఏళ్ళలోపు వయసున్నవారు ఉన్నారు. శనివారం ఉదయం 9:30 గంటలకు పార్టీ జెండా వందనము తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షోపన్యాసం ఉంటుంది. ఫిబ్రవరి 25వ తేదీన మూడు తీర్మానాలను ప్రతిపాదించి ఆమోదించన్నారు. రాజకీయ, ఆర్ధిక, విదేశీ విధానం గురించి ఏఐసీసీ సమావేశంలో ప్రవేశ పెట్టి చర్చించి ఆమోదించనున్నారు. పిబ్రవరి 25వ తేదీన మధ్యాహ్నం సోనియా గాంధీ ఉపన్యాసం ఉండనుంది. ఫిబ్రవరి 26 వ తేదీన మరో మూడు తీర్మానాలైన.. యువత-నిరుద్యోగం, సామాజిక న్యాయం-సాధికారత, వ్యవసాయరంగ సమస్యలపై తీర్మానాలను ప్రతిపాదించి ఆమోదించనున్నారు. పిబ్రవరి 26వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ముగింపు ఉపన్యాసం ఉండనుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే చేసే ముగింపు ఉపన్యాసంలో ఐదు సూత్రాల పార్టీ కార్యక్రమాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 26వ తేదీన ఉదయం ఏఐసీసీ సమావేశాల్లో, ఆ తర్వాత 4 గంటలకు జరిగే భారీ బహిరంగ సభ నుద్దేశించి రాహుల్‌గాంధీ మాట్లాడనున్నారు. ఈ ప్లీనరీ సమావేశాల్లో ప్రతిపక్షాల ఐక్యతపై కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చర్చించనుంది. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను ఇందులో చర్చిస్తామని తెలిపిన కాంగ్రెస్.. తమ పార్టీ లేకుండా ప్రతిపక్షాల ఐక్యత విజయవంతం కాదని ప్రకటించింది. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్షాల ఐక్యతకు కృషి చేస్తోంది. 2024 లోకసభ సార్వత్రిక ఎన్నికల్లో అధికారం నుంచి బీజేపీని తొలగించడమే లక్ష్యంగా కాంగ్రెస్ సాగుతోంది. ప్రతిపక్షాల ఐక్యతకు కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకోవాలని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేసిన ప్రకటనను స్వాగతించిన కాంగ్రెస్.. భారత రాజకీయాలు సమూల మార్పు చెందే సమయం ఆసన్నమైందన్న విషయాన్ని నితీష్ గ్రహించారని, నితీష్ కుమార్ సూచనను స్వాగతిస్తున్నామని తెలిపింది. దేశ రాజకీయాల్లో తమ పాత్రేంటో తమకు స్పష్టంగా తెలుసుని పేర్కొంది.ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పలు పార్టీలతో పొత్తు పెట్టుకున్నామని తెలిపిన కాంగ్రెస్.. ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకోవాలా? లేదా ఏ రకంగా పొత్తులు, అవగాహనలు ఉండాలో ప్లీనరీ సమావేశాల్లో చర్చిస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఓడించే విషయంలో, ప్రతిపక్షాల ఐక్యత విషయంలో రెండు నాలుకల ధోరణిని అవలంబించదని స్పష్టం చేసింది. కాగా.. 2005లో హైదరాబాదులో నిర్వహించిన ప్లీనరీ సమావేశాల తర్వాత తొలిసారిగా ఢిల్లీ వెలుపల రాయ్‌పూర్‌లో నిర్వహిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)