ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితుడి ఎన్ కౌంటర్

Telugu Lo Computer
0


ఉత్తర ప్రదేశ్ రాజకీయాలను ఉమేష్ పాల్ హత్య కేసు కుదిపేస్తోంది. ఇటీవల ఈ హత్యపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ), ఆ పార్టీ చీఫ్ పై ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మాఫియాను మట్టిలో కలిపేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితుల కోసం 10 పోలీస్ టీములు రాష్ట్రాన్ని జల్లెడ పడుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు. ప్రయాగ్ రాజ్ లోని నెహ్రూ పార్క్ నిందితుడు అర్బాజ్ ను ఉత్తర్ ప్రదేశ్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, జిల్లా పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. 2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ ను గత శుక్రవారం సాయంత్రం ప్రయాగ్ రాజ్ లోని తన నివాసంలోనే కాల్చి చంపారు. కారు నుంచి దిగుతుండగా  ఉమేష్ పాల్ ను గుర్తు తెలియని వ్యక్తి కాల్చి చంపాడు. మాజీ ఎంపీ, సమాజ్ వాదీ పార్టీ నేత అతిక్ అహ్మద్ సోదరుడు అతని బంధువులపై కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులో బీజేపీ నేత రహీల్ హసన్ సోదరుడు గులామ్ పేరును కూడా చేర్చారు. పార్టీ నుంచి ఆయనను తొలగించారు. రాజు పాల్ 2005లో బీఎస్పీ తరుపున పోటీ చేసి అలహాబాద్ (పశ్చిమ) నియోజకవర్గం నుంచి గెలిచారు. ఈ ఎన్నికల్లో మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ తమ్ముడు ఖలీద్ అజీమ్ ను ఓడించారు. ఈ ఓటమితో అతిక్, అతని తమ్ముడే రాజుపాల్ ను హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం నిందితులు అంతా జైలులో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ ను శుక్రవారం దుండగులు హత్య చేశారు. ఈ హత్య కేసులో అతిక్ బంధువులతో సహా 40 మందిని అదుపులోకి తీసుకున్నారు యూపీ పోలీసులు. అహ్మదాబాద్ లోని సబర్మతి జైలులో ఉన్న అతిక్ ఖాన్ ఈ కేసులో కుట్ర పన్నాడని యూపీ పోలీసులు భావిస్తున్నందున ఆయనను ప్రశ్నించేందుకు సిద్ధం అయ్యారు. కాగా, ఈ హత్య కేసులో సీబీఐ విచారణను డిమాండ్ చేస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు అతిక్ అహ్మద్ భార్య షాహిస్తా పర్వీన్ లేఖ రాశారు. ప్రయాగ్ రాజ్ పోలీస్ కమిషనర్ రమేష్ శర్మ, ఏడీజీ ఎస్టీఎఫ్ అమితాబ్ యాష్ ప్రత్యర్థులతో కుమ్మక్కయ్యారని.. తన భర్త అతిక్ అహ్మద్, ఆయన తమ్ముడు అష్రఫ్ లను హత్య చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)