కర్నాటకలో మరో కాంట్రాక్టర్‌ ఆత్మహత్య

Telugu Lo Computer
0


కర్నాటకలోని తుమకూరు జిల్లాకు చెందిన కాంట్రాక్టర్‌ టీఎన్‌ ప్రసాద్‌ (50) ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వం నుంచి బిల్లులు క్లియర్‌ కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.  బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలోని స్మార్ట్‌సిటీ ప్రాజెక్ట్‌ కింద రూ.16 కోట్ల విలువైన నిర్మాణ పనులను కాంట్రాక్టర్‌ ప్రసాద్‌ చేపట్టారు. అయితే బిల్లుల బకాయిలను ప్రభుత్వం క్లియర్ చేయకపోవడంతో అప్పులపాలయ్యాడు. దీంతో, అప్పులు చెల్లించకలేక తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే తన మరణానికి ఎవరూ బాధ్యులు కాదంటూ సూసైడ్‌ నోట్‌లో ఉందని చెప్పారు. ప్రసాద్‌ మృతిపై కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు బలరాం స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ కాంట్రాక్ట్‌ను పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్‌ ప్రసాద్‌ భారీగా రుణాలు పొందాడని బలరాం చెప్పుకొచ్చారు. ఆ అప్పు తీర్చేందుకు ఐదు నెలల కిందట తన ఇంటిని కూడా అమ్మేశాడని తెలిపారు. బిల్లుల క్లియరెన్స్‌లో ఆలస్యం వల్ల తాను మనోవేదనకు గురవుతున్నట్టు తనతో చర్చించినట్టు వెల్లడించారు. ఈ క్రమంలో కర్నాటకలోని బీజేపీ సర్కార్‌పై విపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. 40 శాతం కమీషన్‌ ఇవ్వకపోతే బిల్లులు పాస్‌ కావంటూ కొందరు కాంట్రాక్టర్లతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ నేతలు కామెంట్స్‌ చేస్తున్నారు. అందుకే ఇలా ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)