విద్యార్థులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన స్కూల్ ప్రిన్సిపాల్ !

Telugu Lo Computer
0


హిమాచల్ ప్రదేశ్ లోని కోట్‌ఖాయ్-సోలన్ రహదారిలో సిమ్లా నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు టాపర్‌లకు ఉచిత విమాన, రైలు, రోడ్డు ప్రయాణాన్ని ప్రకటించారు. బాలాగ్‌లోని ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్ సందీప్ శర్మ ప్రయాణాలకు అయ్యే ఖర్చులను తాను సొంతంగా భరిస్తానని విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు. 11, 12వ తరగతి టాపర్‌లకు చండీగఢ్ లేదా ధర్మశాలకు విమాన ప్రయాణ సౌకర్యం కల్పిస్తానని సందీప్ శర్మ తెలిపారు. 9, 10వ తరగతి టాపర్లకు కల్కా-న్యూఢిల్లీ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీకి ప్రయాణించే అవకాశం కల్పిస్తానని చెప్పారు. 6, 7, 8 తరగతుల టాపర్‌లను చండీగఢ్‌కు రోడ్డు యాత్రకు తీసుకువెళతామన్నారు. విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన పోటీని పెంపొందించి కష్టపడి పనిచేసేలా చైతన్యవంతులను చేయడమే తన ధ్యేయమన్నారు. 'ఇది విద్యార్థుల్లో ఉత్సాహాన్ని పెంచుతుందన్నారు. వారిలో ఎక్కువ మంది పెద్ద నగరాలకు ప్రయాణించి ఉండకపోవచ్చు. విద్యార్థులు ఇప్పటికే ఉత్సాహంగా ఉన్నారు. నగదు బహుమతులు ఇవ్వడం కంటే ప్రయాణం సౌకర్యం కల్పించడం ఉత్తమమైన ఎంపిక. ఎందుకంటే విద్యార్థులు కొత్త ప్లేస్‌లను చూసి సరికొత్త విషయాలు నేర్చుకుంటారు. అంతేకాకుండా ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటారు..' అని సందీప్ శర్మ అన్నారు. ఈ కార్యక్రమం విద్యార్థులపై ప్రభావం చూపుతోందని,  చదువుకు ఎక్కువ సమయం ఇస్తున్నారని ఆయన చెప్పారు. అంతకుముందు ప్రధానోపాధ్యాయుడు తన విద్యాలయం చెయోంగ్‌లోని ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాల పునరుద్ధరణకు రూ.10 లక్షలు వెచ్చించారు. ప్రిన్సిపాల్ సందీప్ శర్మ ప్రకటించిన ఆఫర్‌కు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. తన సొంత డబ్బును విద్యార్థుల కోసం ఖర్చు చేస్తున్న ఉపాధ్యాయుడు చాలా గ్రేట్ అని మెచ్చుకుంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)