తాగితే తప్పేంటి ?

Telugu Lo Computer
0


మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి మద్యం బాటిల్ పట్టుకుని కనిపిస్తున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఈ ఫోటోతో మంత్రి మల్లారెడ్డిని, టిఆర్ఎస్ మంత్రుల తీరును, మునుగోడు ఉపఎన్నికల్లో ప్రలోభాల పర్వానికి తెరతీసిన అంశాన్ని ప్రధాన ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మళ్లీ మంత్రి మల్లారెడ్డి మీడియాలో వైరల్ అవుతున్న తన ఫోటోపై, ప్రతిపక్షాల విమర్శలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరికి వారు మునుగోడు ఓటర్ల మనసును గెలుచుకోవాలని, తమకు అనుకూలంగా ఓటు బ్యాంకును మార్చుకోవడం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. తమ పార్టీ నుండి ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థిని గెలిపిస్తే ఏం చేస్తామో చెబుతూ ప్రచారం సాగిస్తూనే, ప్రత్యర్థి పార్టీలలో ఉన్నబలహీనతలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న మంత్రులు ఎక్కడ దొరుకుతారా అని చూస్తున్న బిజెపి, కాంగ్రెస్ నాయకులకు ఓ మందు పార్టీలో కూర్చున్న మంత్రి మల్లారెడ్డి దొరికారు. ఆయన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ మునుగోడులో ప్రలోభాల పర్వానికి టిఆర్ఎస్ పార్టీ తెర తీసిందని, దీనిపై ఎన్నికల కమీషన్ దృష్టికి తీసుకు వెళ్తామని బిజెపి, కాంగ్రెస్ నాయకులు మంత్రి మల్లారెడ్డిని టార్గెట్ చేసి మండిపడుతున్నారు. ఇక ఈ ఫోటోపై సమాధానం చెప్పిన మంత్రి మల్లారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఫోటోలో ఉన్నది తానేనని, తాగితే తప్పేంటి అంటూ మల్లారెడ్డి ప్రశ్నించారు. మునుగోడులో ప్రచారం ముగిసిన తర్వాత బంధువుల ఇంట్లో మద్యం తాగితే తప్పా ? మనకు సన్నిహిత బంధువులకు మద్యం పోస్తే తప్పా? అంటూ మండిపడ్డారు. కావాలని ప్రత్యర్థి పార్టీలు తన ఫోటోలను వైరల్ చేస్తూ అనవసరపు రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి మల్లారెడ్డి నిప్పులు చెరిగారు. బీజేపీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి మల్లారెడ్డి ఎన్నికల కమిషన్ కు కాకపోతే సీబీఐకి ఫిర్యాదు చేసుకోండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తానంటే గిట్టని వాళ్లు ఈ పని చేస్తున్నారంటూ మండిపడ్డారు మల్లారెడ్డి . తన ఫొటోలు వైరల్ చేయడం బీజేపీ కుట్ర అంటూ వ్యాఖ్యలు చేశారు. తానేదో చేయకూడని పని చేసినట్టు బీజేపీ అనవసరపు రాద్ధాంతం చేస్తోందంటూ మంత్రి మల్లారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఇక వైరల్ అవుతున్న తన ఫోటోలలో తన ముందు ఉన్న ప్లేట్ ఖాళీగా ఉందని పేర్కొన్న మల్లారెడ్డి తాను అప్పటివరకూ మద్యం కూడా సేవించ లేదని, చెప్పుకొచ్చారు. ప్రతి చిన్న విషయానికి రాద్ధాంతం చేయడం బిజెపి నాయకులకు అలవాటైపోయింది అని, వాళ్ళకు చేతనైంది చేసుకోమంటూ మల్లారెడ్డి విరుచుకుపడ్డారు.

Post a Comment

0Comments

Post a Comment (0)