రూపాయి-రూబుల్‌లో వర్తకం ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 1 April 2022

రూపాయి-రూబుల్‌లో వర్తకం !


పశ్చిమ దేశాల ఆంక్షల ప్రభావాన్ని తప్పించుకునేందుకు భారత్‌, ఇతర మిత్ర దేశాలతో వాణిజ్యాన్ని జాతీయ కరెన్సీల్లోనే నిర్వహించే విధానం వైపు అడుగులు వేస్తున్నామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌ తెలిపారు. భారత్‌తో ఉన్న ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోనున్నట్లు పేర్కొన్నారు. చైనా పర్యటన అనంతరం గురువారం సాయంత్రం దిల్లీ చేరుకున్న లవ్రోవ్‌ శుక్రవారం విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌తో సమావేశమయ్యారు. ఉక్రెయిన్‌ సంక్షోభం, భారత్‌, రష్యాల సంబంధాలపై అది చూపే ప్రభావం, వాణిజ్యం వంటి అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చాయి. ద్వైపాక్షిక ఆర్థిక, సాంకేతిక సంబంధాలు స్థిరంగా కొనసాగేలా చూడాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. అనంతరం ప్రధాని మోదీతోనూ లవ్రోవ్‌ భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌ యుద్ధంపై భారత్‌ అనుసరిస్తున్న తటస్థ వైఖరిపై అమెరికా వంటి దేశాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. రష్యాపై విధించిన ఆంక్షలను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించే దేశాలపై చర్యలు తప్పవని అమెరికా జాతీయ భద్రత ఉప సలహాదారు దలీప్‌ సింగ్‌ గురువారం హెచ్చరించారు. రష్యా నుంచి ఇంధనం, ఇతర వస్తువులను భారీగా దిగుమతి చేసుకోరాదని మన దేశానికి సూచించారు. ఆ మరుసటి రోజే జరిగిన లవ్రోవ్‌-జైశంకర్‌ల భేటీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఉక్రెయిన్‌ యుద్ధానికి ముందున్న ధరతో పోలిస్తే పీపాకు 35 డాలర్ల మేర రాయితీతో భారత్‌కు చమురును విక్రయించేందుకు రష్యా ముందుకొచ్చిందంటూ వార్తలు వచ్చాయి. 1.5 లక్షల పీపాలను కొనుగోలు చేయాలని మన దేశాన్ని కోరుతున్నట్లు సమాచారం. లవ్రోవ్‌- జైశంకర్‌ భేటీలోనూ ఈ చౌక చమురు సరఫరాపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. రష్యా నుంచి భారీ స్థాయిలో ముడి చమురును కొనుగోలు చేసేందుకు భారత్‌ సంసిద్ధత వ్యక్తంచేసిందా అన్న విలేకరుల ప్రశ్నకు ''భారత్‌ తమకు కీలక దేశమని వారు కోరే ఏ వస్తువునైనా సరఫరా చేసేందుకు మేం సిద్ధం'' అని లవ్రోవ్‌ చెప్పారు. పశ్చిమ దేశాల ఆంక్షలను తప్పించుకునేందుకు రూపాయి-రూబుల్‌ చెల్లింపుల వ్యవస్థను ప్రారంభించే అంశంపై చర్చించారా అన్న ప్రశ్నకు.. భారత్‌, చైనా వంటి దేశాలతో జరుగుతున్న వాణిజ్యంలో చాలా కాలం కిందటే ఇలాంటి ఏర్పాటు జరిగిందని లవ్రోవ్‌ తెలిపారు. ఆ దేశాలతో డాలర్లు, యూరోలు వాడకుండా చాలా వరకూ జాతీయ కరెన్సీలనే ఉపయోగిస్తున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విధానం మరింత ముమ్మరమవుతుందని, ఇది తప్పదని తెలిపారు. ''ఏదో సమయంలో మూతబడే వ్యవస్థపై మేం ఆధారపడదలచుకోలేదు. అలాగే రాత్రికి రాత్రే డబ్బును తస్కరించే వ్యక్తుల ఆధ్వర్యంలోని వ్యవస్థపై నమ్మకం పెట్టుకోదలచుకోలేదు'' అని పశ్చిమ దేశాలను ఉద్దేశించి విమర్శలు చేశారు. భారత్‌, రష్యాల్లోని సంబంధిత మంత్రిత్వశాఖల మధ్య చాలా మంచి సంబంధాలు ఉన్నాయని, ఆంక్షలున్నా ద్వైపాక్షిక వాణిజ్యం కొనసాగేలా చూడటానికి అవి ప్రయత్నిస్తాయని తెలిపారు. సాంకేతిక-సైనిక సహకారం అంశానికీ ఇది వర్తిస్తుందన్నారు. ఉక్రెయిన్‌ ఘర్షణపై భారత్‌ అనుసరించిన వైఖరిని రష్యా విదేశాంగ మంత్రి ప్రశంసించారు. ఈ విషయంలో ఏకపక్షంగా కాకుండా పరిస్థితి మొత్తాన్నీ బేరీజు వేసుకొని వ్యవహరిస్తోందన్నారు. పొరుగు దేశాలతో సంబంధాలు మెరుగుపరచుకోవడానికి భారత్‌ చేస్తున్న ప్రయత్నాలకు రష్యా మద్దతు ఇస్తుందని చెప్పారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు పలికేందుకు భారత్‌ మధ్యవర్తిత్వం వహించే వీలుందా అన్న ప్రశ్నకు.. ''అంతర్జాతీయ సమస్యలపై హేతుబద్ధమైన వైఖరిని అనుసరించే భారత్‌.. వివాద పరిష్కారానికి ముందుకొస్తే ఎవరికి అభ్యంతరం ఉంటుంది'' అని లవ్రోవ్‌ పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో భారత్‌ నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని చెప్పారు. ఉక్రెయిన్‌లో ఘర్షణలు త్వరగా ముగిసిపోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. వివాద పరిష్కారానికి, శాంతి చర్చలకు సాయపడేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని చెప్పారు. రష్యా విదేశాంగ మంత్రి లవ్రోవ్‌తో భేటీ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌లో పరిస్థితిని లవ్రోవ్‌.. మోదీకి వివరించారు. శాంతి చర్చల అంశాన్నీ ప్రస్తావించారు. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన భారత్‌-రష్యా శిఖరాగ్ర సదస్సులో తీసుకున్న నిర్ణయాల అమలులో జరిగిన పురోగతినీ ఆయన ప్రధానికి వివరించారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ.. తమ అధ్యక్షుడు పుతిన్‌ పంపిన సందేశాన్ని వ్యక్తిగతంగా మోదీకి చెప్పాలనుకుంటున్నట్లు తెలిపారు.

No comments:

Post a Comment