చిన్నమ్మని పార్టీలోకి తెచ్చేందుకు యత్నం?

Telugu Lo Computer
0


అన్నాడీఎంకే పార్టీని ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారు. పార్టీలో నెలకొన్న వర్గపోరే వరుస ఓటములకు కారణమని అని పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఓపీఎస్‌, ఈపీఎస్‌ ద్వంద్వ నాయకత్వంతో ఇకపై లాభం లేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఎడప్పాడి పళనిస్వామికి ఎక్కువగా పలుకుబడి ఉండే కొంగు మండలం, పన్నీర్‌ సెల్వానికి పలుకుబడి ఉండే దక్షిణ మండలాల్లోనూ అన్నాడీఎంకేకు ఊహించని ఓటమి ఎదురు కావడం కూడా పార్టీలో కొత్త చర్చకు దారితీస్తోంది. దీంతో నాయకత్వాన్ని మార్చాలన్న డిమాండ్‌ పార్టీలో ఎక్కువైనట్లు తెలుస్తోంది. దాంతో జయలలితకు నీడలా వ్యవహరించిన శశికళే పార్టీకి నేతృత్వం వహించాలని కొత్త అంశాన్ని దక్షిణ మండల అన్నాడీఎంకే వర్గాలు ముందుకు తెచ్చాయి. ఇందుకు ఓపీఎస్‌ కూడా అంగీకరిస్తారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకేలో అనుకోని మలుపు చోటు చేసుకుంది. తేని జిల్లా పెరియకుళం కైలాసపట్టిలోని అన్నాడీఎంకే సమన్వయకర్త పన్నీర్‌ సెల్వానికి సొంతమైన ఫామ్‌ హౌస్‌లో బుధవారం కీలక సమావేశం జరిగింది. ఇందులో తేని జిల్లా అన్నాడీఎంకే ముఖ్య నిర్వాహకులు అనేక మంది పాల్గొన్నారు. అన్నాడీఎంకే, ఏఎంఎంకే, శశికళ ఒక్కటయితే తప్ప అన్నాడీఎంకే విజయం సాధించటం సాధ్యం కాదని నిర్వాహకులు, కార్యకర్తలు పేర్కొన్నట్లు తెలుస్తోంది. 5వ తేదీ శశికళను అన్నాడీఎంకేలో చేర్చుకోవటం గురించి తీర్మానం ఆమోదించి పార్టీ అధిష్టానానికి పంపాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం తేని జిల్లాలో తీసుకున్న నిర్ణయం లాగానే మిగతా జిల్లాల్లో కూడా తీర్మానం ఆమోదిస్తారని తెలుస్తోంది. ప్రారంభం నుంచే శశికళను పార్టీలోకి చేర్చుకోవాలనే అభిప్రాయంలోనే ఓపీఎస్‌ ఉన్నారన్న విషయం తెలిసిందే. పార్టీ వ్యవహారాల్లో ఎడప్పాడి పళనిస్వామిది పైచేయిగా ఉండటంతో ఓపీఎస్‌ వాదన అప్పట్లో సద్దుమణిగాయి. అయితే అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయంతో శిశికళ అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది.అయితే ఈ అంశంపై ఎడప్పాడి వర్గం కొన్ని రోజులుగా మౌనం వహిస్తోంది. తేని జిల్లాలో తీసుకున్న నిర్ణయంపై ఎడప్పాడి వర్గం ఎలా స్పందిస్తారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)