మా గ్రామాలను తెలంగాణలో కలపండి

Telugu Lo Computer
0


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ ఆర్డినెన్స్ ద్వారా భద్రాచలం మండలంలోని ఐదు గ్రామాలతో పాటు, సీలేరు ప్రాజెక్టును బలవంతంగా ఆంధ్రప్రదేశ్ లో కలిపారు. దీంతో విలీన గ్రామాల ప్రజలు సమస్యలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూతవేటు దూరంలో ఉన్న భద్రాద్రికి బదులుగా ఎక్కడో వందల కిలో మీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రం రాజమండ్రికి వెళ్లాల్సిరావడం, సరిహద్దు గ్రామాలు కావడంతో ఏపీ అధికారులు కూడా కన్నెత్తి చూడకపోవడం, తదితర కారణాలతో విలీన గ్రామాల ప్రజల బాధలు వర్ణనాతీతం. గత ఏడేళ్లుగా భద్రాచలానికి ఆనుకుని ఉన్న ఐదు గ్రామాలు పిచ్చుకలపాడు, పురుషోత్తమ పట్నం, ఎటపాక, గుండాల, కన్నాయిగూడెంలను తిరిగి తెలంగాణలో కలపాలన్న డిమాండ్‌ రగులుతూనే ఉంది. ఆ అయిదు గ్రామాలను వెనక్కి తీసుకొస్తేనే భద్రాచలం సమగ్రాభివృద్ధి సాధ్యమన్న వాదన రాజకీయ పక్షాల్లో ఉంది. ఐదుగ్రామాలపై ఆరునెలల కిందట అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈక్రమంలో సీపీఎం పార్టీ ఆ ఐదు గ్రామపంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాలంటూ ఉద్యమం మొదలుపెట్టింది. తాజాగా రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన భద్రాచలం మండలంలోని ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతూ ఆయనకు పదివేల పోస్టుకార్డులను పంపే ఉద్యమాన్ని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఏజే రమేష్‌ ప్రారంభించారు. ఈక్రమంలో భద్రాచలం పట్టణంలో అంతర్భాగమైన తమ కాలనీని విభజనలో ఆంధ్రాలో కలపటం వలన తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని రాజుపేట కాలనీవాసులు సీపీఎం నేతల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మొత్తంగా భద్రాచలంకు ఆనుకుని ఉన్న ఐదుగ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలన్న డిమాండ్ బీజేపీకి ఇబ్బందికరంగా మారనుంది. కేంద్రం ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తుందో లేదో కాని ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఈ గ్రామ పంచాయతీల విలీనం అంశం తలనొప్పిగా మారనుంది. ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలిపితే సీఎం కేసీఆర్‌కు రాజకీయంగా మైలేజీ ఇచ్చినట్లు అవుతుందని కాదని విలీనం చేయకుంటే భద్రాద్రి జిల్లాలో బీజేపీకి చావుదెబ్బ తప్పదు..దీంతో బండి సంజయ్ పరిస్థితి ముందు నుయ్యి గొయ్యిలా మారింది.


Post a Comment

0Comments

Post a Comment (0)