సూసైడ్‌ మెషీన్‌!

Telugu Lo Computer
0


నొప్పి తెలియకుండానే నిమిషం వ్యవధిలోచంపేసే యంత్రమే సూసైడ్‌ మెషీన్‌. దీన్ని 'సార్కో' అని కూడా పిలుస్తారు. శవపేటిక తరహాలో ఉండే ఆ యంత్రంలోకి వెళ్లి పడుకుంటే చాలు నిమిషం గడువకముందే మరణిస్తారు. హైపోక్సియా, హైపోకాప్నియా సైకిల్‌ (వలయం)' సూత్రంపై ఈ మెషీన్‌ పనిచేస్తుంది. పేటికలో మనిషి పడుకోగానే అందులోకి నత్రజనిని పంపిస్తారు. తద్వారా బాధితుడి శరీరంలోని జీవకణాలకు ఆక్సిజన్‌ సరఫరా క్రమంగా నిలిచిపోతుంది. ఇదేసమయంలో రక్తంలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ స్థాయిలు పెరుగుతాయి. అత్యంత తక్కువ వ్యవధిలో జరిగే ఈ సైకిల్‌ ప్రభావాన్ని బాధితుడు గుర్తించేలోపే మరణం సంభవిస్తుంది. తీవ్రమైన వ్యాధులతో పోరాడుతూ.. మరణం కోసం ఎదురుచూసే వారికి మాత్రమే ఇలాంటి యంత్రాలను వాడాలని స్విట్జర్లాండ్‌ చట్టాలు చెబుతున్నాయి. కారుణ్య మరణం పొందాలనుకునే వారు.. కోర్టు, ప్రభుత్వం అనుమతితో పాటు వైద్యుడి సర్టిఫికెట్‌ కూడా పొందాలి. సార్కో యంత్రాన్నిడాక్టర్‌ ఫిలిప్‌ నిట్ష్కే రూపొందించారు. దీంతో ఆయన్ని 'డాక్టర్‌ డెత్‌’ అని పిలుస్తున్నారు. 'సార్కో' అనే పేరును 'సార్కోఫాగస్‌’ (శవపేటిక) నుంచి తీసుకున్నారు. ఆత్మహత్య మహా పాపం. నేరంకూడా. అయితే, అనారోగ్యంతో చిక్కి శల్యమై, కదల్లేని స్థితిలో రోజూ నరకం అనుభవించేవారు కారుణ్య మరణాలకు అనుమతించాలని కోర్టులను ఆశ్రయించే కేసులను చూసే ఉంటాం. అనుమతి పొందిన బాధితులకు మరణాన్ని ప్రసాదించే ప్రక్రియ సుదీర్ఘంగా, బాధను కలిగించేలా ఉండటంతో ఈ ప్రక్రియను సులభతరం చేయాలన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నొప్పిలేని మరణాన్ని ఇచ్చే 'సూసైడ్‌ మెషీన్‌’కు స్విట్జర్లాండ్‌ అనుమతి ఇచ్చింది.


Post a Comment

0Comments

Post a Comment (0)