బాధితుల్లో ఐపీఎస్‌లు, బ్యూరోక్రాట్ల బంధువులు !

Telugu Lo Computer
0


శిల్పాచౌదరి బాధితుల జాబితాలో సెలబ్రిటీలు, ఐపీఎస్‌లు, ఇతర బ్యూరోక్రాట్ల బంధువులు కూడా ఉన్న నేపథ్యంలో సమస్యను పరిష్కరించే దిశలో చర్యలు సాగుతున్నట్లు సమాచారం. నిజానికి ఈ తరహా కేసులపై ఠాణాలకు వెళ్తే 'సివిల్‌ కేసుల్ని కోర్టుల్లోనే పరిష్కరించుకోవాలి' అంటూ పోలీసులు తాపీగా సమాధానం ఇస్తారు. శిల్పాచౌదరి విషయంలో తమకు ఫిర్యాదు చేసిన వారికి సంబంధించిన దర్యాప్తుతోపాటు అనధికారికంగా తమకు వస్తున్న మౌఖిక ఫిర్యాదులు, పెరుగుతున్న ఒత్తిడితో సమాంతర దర్యాప్తుపైనే దృష్టిపెట్టారని తెలుస్తోంది. తనకు డబ్బులిచ్చిన వారిలో చాలామంది బ్లాక్‌మనీని వైట్‌గా మార్చుకునే ప్రయత్నం చేశారని తొలిరోజు పోలీసు కస్టడీ సందర్భంగా శిల్ప స్పష్టం చేసిన నేపథ్యంలో లోపల్లోపలే సెటిల్‌ చేయాలంటూ సెలబ్రిటీలు, బ్యూరోక్రాట్ల నుంచి పోలీసులపై ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది. కాగా, శిల్పాచౌదరి రెండోరోజు పోలీసు కస్టడీలో పెద్దగా వివరాలేమీ చెప్పలేదని తెలిసింది. 'నేను అమాయకురాలిని. రాధికారెడ్డి అనే మహిళ వద్ద పెట్టుబడి పెట్టాను. ఆమె చెప్పిన సమయానికి డబ్బులు ఇవ్వలేదు. నేను ఎవరికీ అన్యాయం చేయను. అందరికీ డబ్బులిచ్చేస్తా' అని చెప్పినట్లు సమాచారం.ఓ ఆస్పత్రి నిర్మాణం కోసం కోట్ల రూపాయలను వెచ్చించినట్లు ఆమె పోలీసులకు చెప్పిందని సమాచారం. తమ ఇంట్లో చాలా ఆధారాలున్నాయని శిల్ప చెప్పినట్లు తెలిసింది. దాంతో పోలీసులు ఆమెను ఇంటికి తీసుకెళ్లి వాటిని స్వాధీనం చేసుకున్నారు. హవాలా డబ్బులపైనా పోలీసులు ఎలాం టి సమాధానాలను రాబట్టుకోలేదని సమాచారం. రెండు రోజుల కస్టడీ ముగియడంతో శిల్పాచౌదరిని సాయంత్రం కోర్టులో హాజరుపరిచి తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే, రాధికారెడ్డి అనే పేరును శిల్ప వెల్లడించలేదని పోలీసులు చెబుతుండగా శనివారం రాత్రి రాధికారెడ్డి అనే పేరున్న మహిళ ఒకరు మాదాపూర్‌ డీసీపీని కలిశారు. శిల్పతో ఎలాంటి సంబంధం లేదని, తన పేరు మీడియాలో చక్కర్లు కొడుతోందని ఫిర్యాదు చేశారని సమాచారం. మీడియాను నియంత్రించాలని ఆమె కోరినట్లు తెలిసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)