ప్రధాని మోదీకి చినజీయర్‌ ఆహ్వానం

Telugu Lo Computer
0


భగవత్‌ రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరుకావాలని ప్రధాని మోదీని చినజీయర్‌ స్వామి ఆహ్వానించారు. ప్రధాని నివాసంలో ఆయనను శనివారం కలిసి స్వయంగా ఆహ్వాన పత్రిక అందించారు. రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకల విశిష్టతను మోదీకి వివరించారు. జూపల్లి రామేశ్వరరావు కూడా మోదీని కలిసి ప్రాజెక్టు విశేషాలను తెలియజేశారు. సమతా స్ఫూర్తి కేంద్రం విశిష్టత, స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీకి ప్రతిబింబంగా ఏర్పాటు చేయనున్న 216 అడుగుల రామానుజాచార్య పంచలోహ విగ్రహ విశిష్టతను, అక్కడ కొలువుదీరనున్న 108 దివ్యదేశాల వివరాలను ప్రధాని ఈ సందర్భంగా తెలుసుకున్నారు. ప్రపంచ శాంతి కోసం చినజీయర్‌ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రధాని మోదీ అభినందించారు. విగ్రహ ఆవిష్కరణకు తప్పక వస్తానని హామీ ఇచ్చారు. రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకల సందర్భంగా శంషాబాద్‌ ముచ్చింతల్‌లోని చినజీయర్‌ స్వామి ఆశ్రమంలో అతిపెద్ద సమతామూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది 216 అడుగుల పంచలోహ విగ్రహం. మొత్తం 200 ఎకరాల్లో రూ.వెయ్యి కోట్లతో ఈ ప్రాజెక్టును రూపుదిద్దుతున్నారు. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకూ విగ్రహావిష్కరణ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 35 హోమగుండాలతో ప్రత్యేక యాగం చేయనున్నారు. ఇందుకోసం 2 లక్షల కిలోల ఆవు నెయ్యిని వినియోగించనున్నారు. ఈ మహోత్సవానికి ఆహ్వానించేందుకు గత ఐదు రోజులుగా దిల్లీలో పర్యటిస్తున్న చినజీయర్‌ ఇప్పటికే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, కిషన్‌ రెడ్డి సహా ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ తదితరులను చినజీయర్‌ ఆహ్వానించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణకు కూడా కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానం పలికారు. 

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)