నందమూరి హరికృష్ణ

Telugu Lo Computer
0


నందమూరి హరికృష్ణ ప్రముఖ తెలుగు సినిమా నటుడు, రాజకీయ నాయకుడు. ఈయన నందమూరి తారక రామారావు మూడో కుమారుడు. తెలుగుదేశం పార్టీ తరపున శాసన రాజ్యసభ కు ప్రాతినిధ్యం వహించారు. రామారావు తెలుగు దేశం పార్టీ ఏర్పాటులో భాగంగా రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటించే సమయంలో హరికృష్ణ తండ్రి ప్రయాణించిన చైతన్య రథం వాహన సారథ్య బాధ్యతలు వహించారు. ఇతని కుమారులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్.టి.ఆర్ ఇద్దరూ తెలుగు నటులే. హరికృష్ణ ఆగస్టు 29, 2018న నల్గొండ జిల్లా, అన్నెపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. హరికృష్ణ, సెప్టెంబరు 2, 1956 న ఎన్. టి. ఆర్, బసవతారకం దంపతులకు మూడో సంతానంగా జన్మించారు.1980లో కర్ణాటకలోని ఉడుపి జిల్లాకు చెందిన శాలినిని వివాహం చేసుకున్నారు. ఆమె తండ్రి వ్యాపారవేత్త. వ్యాపారంలో భాగంగా వారి కుటుంబం 1960వ దశకంలో హైదరాబాదులో స్థిరపడ్డారు. హరికృష్ణ రాష్ట్ర మంత్రిగా, శాసనసభ్యుడిగా, రాజ్య సభ సభ్యుడిగా పనిచేశారు.1995 లో తెలుగుదేశం పార్టీలో సంక్షోభం ఏర్పడి అధికార మార్పిడి జరిగినప్పుడు తండ్రికి వ్యతిరేకంగా చంద్రబాబును సమర్ధించి క్రియాశీలక పాత్ర పోషించారు.1995లో చంద్రబాబు నాయకత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో హరికృష్ణకు రవాణాశాఖ కేటాయించారు. కానీ ఆరు నెలల్లో ఆయన ఎక్కడా శాసనసభకు పోటీచేయలేక పోవడంతో ఆ పదవి వదులుకోవాల్సి వచ్చింది. 1996లో ఎన్. టి. ఆర్ మరణంతో హిందూపురం అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఆ స్థానంలో హరికృష్ణ పోటీ చేసి గెలిచారు. కానీ మంత్రి పదవి చేపట్టలేదు. 1999లో చంద్రబాబుతో విబేధించి అన్న తెలుగుదేశం పేరుతో మరో పార్టీ స్థాపించారు. కానీ కొద్ది రోజులకు మళ్ళీ తెలుగుదేశంలో చేరారు. 2008లో మళ్ళీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. అదే సంవత్సరం ఆయనను తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడిగా సిఫారసు చేసింది. అప్పటి నుంచి మరణించే వరకు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఆగస్టు 22, 2013 లో రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా హరికృష్ణ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు. తొలినాళ్ళలో సినిమాల్లో నటించిన హరికృష్ణ తండ్రి రాజకీయ ప్రవేశం తర్వాత తండ్రి వెంటే ఉండి క్రియాశీలక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. సుమారు 25 ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత శ్రీరాములయ్య సినిమాతో మరలా నటనా వృత్తికి చేరువయ్యారు. నక్సలిజం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో హరికృష్ణ సత్యం అనే ఒక నక్సలైటు పాత్ర పోషించారు. తర్వాత సీతారామరాజు, సీతయ్య, టైగర్ హరిశ్చంద్రప్రసాద్ లాంటి సందేశాత్మక సినిమాల్లో నటించారు. 2018, ఆగస్టు 29 న ఉదయం 4:30 గంటలకు హైదరాబాదు నుండి మరో ఇద్దరు వ్యక్తులతో కలసి స్వయంగా కారు నడుపుతూ కావలిలో జరగబోయే ఒక పెళ్ళికి వెళ్తున్న సమయంలో ఉదయం 6:00-6:15 మధ్య తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలోని అన్నెపర్తి వద్ద హైదరాబాదు-విజయవాడ హైవే మీద కారు అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదం జరిగినపుడు కారు పలుసార్లు పల్టీలు  కొట్టడం వలన తీవ్రగాయాలలైన హరికృష్ణను నార్కట్‌పల్లి లోని కామినేని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు, అయినా ఫలితం లేకపోయింది.  సీటు బెల్టు పెట్టుకోకపోవడం, అత్యంత వేగంగా వాహనాన్ని నడపడం, వాహనం నడుపుతున్న సమయం తెల్లవారుజాము కావడం ఆయన మృతికి కారణాలని పోలీసులు తెలియజేశారు.కారులో ఉన్న మరో ఇద్దరు బతికి బయటపడ్డారు. హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకి రాం కూడా 2014 లో నల్గొండకు సమీపంలోనే రోడ్డు ప్రమాదంలో మరణించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)